ఆంధ్రప్రదేశ్ లో, గత మూడు నలుగు రోజులుగా, తక్కువుగా చెప్తున్నా కరోనా కేసులు, ఈ రోజు ఒకేసారి ఎక్కువగా నమోదు అయ్యాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 34 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 16 నమోదవగా జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 109 కు పెరిగింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 8 పాజిటివ్‌ కేసులు నమోదవగా... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44కు పెరిగింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 7 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 91కి చేరింది. అనంతపురం జిల్లాలో కొత్తగా 2 పాజిటివ్‌ కేసులు నమోదవగా... మొత్తంగా 17 కేసులకు పెరిగింది. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదవగా... మొత్తంగా 56 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 42 కేసులు, కడప జిల్లాలో ఇప్పటివరకు 31 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 17 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు, చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 23 కేసులు, విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో పోలీసులు లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత వాహనాలను రోడ్లపైకి రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారిని గుర్తింపు కార్డులు, పాస్​లు ఉంటేనే అనుమతిస్తున్నారు. జిల్లాలో 109 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వాటిలో గుంటూరు నగరంలోనే 68 ఉన్నాయి. కేసుల ఉద్ధృతితో నగరంలో ప్రతి అర కిలోమీటరుకు ఓ చెక్​పోస్టు ఏర్పాటు చేశారు. లాక్​డౌన్ విషయంలో మొదట్లో కొంత ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగానే.. కేసులు విపరీతంగా పెరిగాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రజలు బయటకు రాకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

నిత్యావసరాల కోసం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. సమీప ప్రాంతాల్లోనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇవాళ్టి నుంచి నిత్యావసరాల కొనుగోలుకు సరి-బేసి విధానం అమలు చేస్తున్నారు. సరి సంఖ్య తేదీల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కొనుగోళ్లకు అనుమతిస్తారు. బేసి సంఖ్య తేదీల్లో రోజంతా పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కరోనాను కట్టడి చేయాలంటే కొద్దిరోజులు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. మరో పక్క, కరోనా సోకి చెన్నైలోని గ్రీమ్స్‌రోడ్డు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నెల్లూరు వైద్యుడు సోమవారం ఉదయం 4 గంటలకు మృతి చెందారు. తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్‌ ఈ విషయాన్ని నిర్ధారించారు.

రాష్ట్రంలో కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్​లో తెలిపింది. వీటితో కలిపి రాష్ట్రంలో మెుత్తం కేసుల సంఖ్య 432కి చేరింది. గుంటూరు జిల్లాలో 8 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. చిత్తూరు జిల్లా-2, పశ్చిమ గోదావరి-1, కృష్ణా జిల్లాలో మరో కేసు నమోదైంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రుల్లో 413 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కి చేరుకొంది. రాష్ట్రంలో నమోదైన 12 కేసుల్లో8 కేసులు ఒక్క గుంటూరునగరంలోనే నమోదు కావడంతో నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 కేసులు నమోదు కాగా వాటిలో గుంటూరు నగరంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోని ఆనందపేటకు చెందిన ఒకే కుటుంబంలో 7 పాజిటివ్ కేసులు ఆదివారం నమోదు కావడంతో ఆ సంఖ్య 61కి చేరుకొంది.

నగరంలోని మంగళదాస్ నగర్, కుమ్మరిబజార్, ఆనందపేట, సంగడిగుంట, బుచ్చయ్యతోట, శ్రీనివాసరావుతోట, పొట్టిపాడు చైతన్య పురి, కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తూ గుంటూరు అర్బన్ డిఐజి విహెచ్ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పిడి యాక్టును కూడా అమలు చేస్తామని డిఐజి హెచ్చరించారు. డిఐజీ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ అదుపులోనికి తీసుకున్నారు. అక్కడి ప్రజల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేశారు. నగరంలోనికి ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశించే ప్రధాన రహదారులను కొన్నింటిని మూసివేశారు.

చిలకలూరిపేట జాతీయ రహదారి, పొన్నూరు రోడ్డు, నందివెలుగు రోడ్డు, ఏటుకూరు రోడ్డు రహదారులను పూర్తిగా మూసివేశారు. ఈ క్రమంలో నగరంలోనికి ప్రవేశించే నరస రావుపేట రోడ్డు, అమరావతి రోడ్డు పెదకాకాని వద్ద చెక్పోస్టులను పోలీసులు ఏర్పాటుచేశారు. చెక్ పోస్టుల వద్ద పోలీసులు 24 గంటలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అత్యవసర సర్వీసులను మాత్రమే నగరంలోనికి అనుమతిస్తున్నారు. అత్యవసర సర్వీసులైన వైద్య, పారిశుద్ధ్య, రెవెన్యూ ఉద్యోగులు కూడా ఉదయం 10గంటల్లోపు, సాయంత్రం 5నుంచి 6గంల్లోపు మాత్రమే రాకపోకలు సాగించేందుకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల్లోపు ప్రభుత్వం అందజేసిన పాసులు ఉన్న వాహనాలు, వ్యక్తులకు అనుమతి ఇస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రాకపోకలు సాగించే వ్యక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన వది రోజుల్లో నుమారుగా 750వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాను పణంగా పెడుతున్న అధికార పక్షం గురించి, నివారణ చర్యల గురించి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కళా వెంకట్రావ్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, లేఖ రాసారు. ఇది ఆ లేఖ. "కరోనా రక్కసి ప్రపంచ మానవాళి బతుకులకు సవాలు విసురుతున్న తరుణంలో.. దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించి భౌతిక దూరం పాటించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తూ మూడో దశకు చేరుకుంది. ఇప్పటికే 405 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అధికార పార్టీ నాయకులకు రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశ్య పూర్వకంగా గుంపులుగా వస్తూ కరోనా వ్యాప్తికి ప్రత్యక్షంగా కారకులవుతున్నారు. తత్ఫలితంగా కరోనా మహమ్మారి ఒకరి నుండి మరొకరికి వేగంగా విస్తరించి ప్రజల ప్రాణాలకు పెను ముప్పుగా మారుతోంది. రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో యధేచ్ఛగా తిరుగుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు."

"ఇలాంటి సమయంలో విజయసాయి రెడ్డి వందలాది మందిని వెంటేసుకుని ప్రగతి భారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజల్లో తిరగడం ప్రజా హక్కుల ఉల్లంఘనగానే భావిస్తున్నాం. లాక్‌ డౌన్‌ ఉన్నపుడు ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లకూడదని ప్రజల్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ.. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ తిరిగారు. నిన్నటికి నిన్న.. అమరావతిలో కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ ను కలవడానికి వచ్చారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌ తమిళనాడు నుండి ఏపీకి వచ్చారు. వారికి క్వారంటైన్‌ నిబంధలను ఎందుకు వర్తింప చేయలేదు? చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంద మంది కార్యకర్తలను వెంటేసుకుని ప్రజల వద్దకు వెళ్తున్నారు. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఊరేగింపుతో కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. ఇతర వైసీపీ నేతలు నగదు పంపిణీ, సరుకు పంపిణీ పేరుతో జనాలను పోగేస్తూ.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్‌గౌడ్‌ లాక్‌ డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కి, విపత్కర సమయంలో వందల మందిని పోగేసుకుని కల్వర్టు ప్రారంభోత్సవం చేశారు. దాన్ని ప్రసారం చేసినందుకు మీడియాను కూడా తూలనాడుతూ వీడియో కూడా రిలీజ్‌ చేశారు. మంత్రి ఆదిమూపు సురేష్‌ కరోనా నిబంధలను ఉల్లంఘించి పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లి, తిరిగి ఏపీకి వచ్చారు."

"చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండంలోని ముక్కరాజు పల్లి ఇసుక రీచ్‌ లో ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి బావమరిది వందలాది లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవానిపాలెంలో లాక్‌డౌన్‌లోనూ వైసీపీ నేతలు ఇసుక తవ్వకాలు చేయడాన్ని గ్రామస్తులే అడ్డుకోవాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పసునూరు కొత్తపల్లిలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ నడి బొడ్డులో మంత్రి అనుచరులు ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తుండగా ప్రజలు అడ్డుకున్నారు. కరోనా వైరస్‌తో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య సిబ్బందికి పీపీఈలు ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. దీనివల్ల వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. అందువల్ల వెంటనే పీపీఈలు అందించే ఏర్పాట్లు చేయించాలి. మాస్కులు అడిగినందుకు విశాఖపట్నంలో డా॥ సుధాకర్‌ను, చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్‌ కమీషనర్‌ వెంకట్రామిరెడ్డిని విధుల నుంచి తొలగించారు. రేషన్‌ దుకాణాల వద్ద వందల సంఖ్యలో గుమికూడే విధంగా ప్రభుత్వం చేస్తున్నది. ఇది కరోనా వ్యాప్తిని పెంచుతుంది. కనుక డోర్‌ డెలివరీకి చర్యలు తీసుకోవసిందిగా విజ్ఞప్తి." అంటూ లేఖ రాసారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ విషయంలో పదవీ కాలం కుదించి ఆర్డినెన్స్​ తీసుకువచ్చారు. రమేశ్​ కుమార్​ను ఆ స్థానం నుంచి తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్​గా మద్రాస్​ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ కనగరాజ్​ బాధ్యతలు చేపట్టారు. ఇదంతా కేవలం కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. అయితే జగన్ ప్రభుత్వం చేసిన ఈ పని పై, ఎస్‌ఈసీ పదవీ కాలం కుదిస్తూ ఆర్డినెన్స్, జీవోల జారీపై హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు విచారణ జరిపింది. ఈ నెల 16 కల్లా ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంలో, కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు పై వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ తరుపు అడ్వొకేట్ జనరల్, తమకు ఈ కేసు పై వాదనలు జరపటానికి, చాలా టైం కావలి అని, కనీసం నెల రోజులు సమయం తమకు ఇవ్వాలని, కోర్ట్ ని కోరారు.

అయితే, కోర్ట్ మాత్రం, ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ అభ్యర్ధనను సమర్ధించలేదు. నెల రోజుల సమయం ఇవ్వటం కుదరదు అని కోర్ట్ చెప్పింది. కేవలం మూడు రోజులే సమయం ఇస్తామని, ఏప్రిల్ 16 లోపు, కౌంటర్ దాఖలు చెయ్యాలని, అడ్వకేట్ జనరల్ ను కోరింది. అలాగే, పిటీషన్ దాఖలు చేసిన అందరూ, 17లోపు అభ్యర్ధనలు ఉంటే తెలపాలి అంటూ కోర్ట్ తెలిపింది. కౌంటర్లు, అభ్యర్ధనలు చూసిన తరువాత, వచ్చే సోమవారం అంటే, ఏప్రిల్ 20న ఈ విషయం పై వాదనలు వింటామని హైకోర్ట్ తెలిపింది. అయితే ఇదే సందర్భంలో, ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ఇది కేవలం సర్వీస్ మేటర్ మాత్రమే అని, ఈ విషయంలో మిగిలిన వారు పిటీషన్లు దాఖలు చేయటం కరెక్ట్ కాదని అన్నారు.

రమేష్ కుమార్ తొలగింపుపై టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరి పిటీషన్లు కొట్టేయాలని కోరారు. అయితే అక్కడ పిటీషనర్ల తరుపున హాజరైన జంధ్యాల రవి శంకర్ వాదిస్తూ, ఇది కేవలం సర్వీస్ మేటర్ మాత్రమే కాదని, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఉందని తెలిపారు. అందుకే మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశామని చెప్పారు. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామన్న హైకోర్టు. అయితే తమకు వీరు వేసిన పిటీషన్లు తమ దగ్గర లేవని, అడ్వకేట్ జనరల్ చెప్పటంతో, ఆ పిటీషన్లు అన్నీ అడ్వకేట్ జనరల్ కు కూడా ఇవ్వాలని, కోర్ట్ తెలిపింది. మొత్తానికి, ఈ కేసును నెల రోజులు పాటు సాగదియ్యటానికి ట్రై చేసిన ప్రభుత్వానికి, కోర్ట్ దగ్గర ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read