కరోనా మహమ్మారి.. చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో పశ్చిమ గోదావరి లో 8, కర్నూల్ లో 6, గుంటూరు లో 4, కృష్ణ జిల్లా లో 1 కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 502 కి పెరిగింది మొత్తంగా...రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 500 మార్క్ దాటి 502 కు పెరిగింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 114 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఒక్కరోజే 21 కేసులు నమోదు అయ్యాయి. నరసరావుపేట, దాచేపల్లిలో కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దాచేపల్లిలో ఓ ఆర్​ఎంపీ వైద్యుడికి పాజిటివ్‌గా తేలడంతో..అతని వద్ద వైద్యచికిత్సలకు వచ్చినవారు..పెద్దసంఖ్యలో రక్తనమూనాలను అందించారు. కడప జిల్లాలో కొత్తగా ఇద్దరికి వైరస్‌ సోకడంతో బాధితుల సంఖ్య 33కు పెరిగింది. ప్రొద్దుటూరు చెందిన ఓ మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు... అధికారులు ధ్రువీకరించారు.

ఈమె దిల్లీకి వెళ్లి వ‌చ్చిన వ్యక్తి సోద‌రిగా గుర్తించారు. ఇతర జిల్లాల్లో పరిస్థితి చూస్తే.. నెల్లూరులో 56, కృష్ణాలో45 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒక్క రోజులోనే 8 పాజిటివ్‌ కేసులు నిర్ధరించారు. విజయవాడలోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 1687మంది నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీటిలో 45 పాజిటివ్, 892 నెగటివ్ వచ్చాయి. 751 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. మిగతా జిల్లాల్లో చూస్తే..ప్రకాశం 42, చిత్తూరు జిల్లాలో 23, విశాఖ జిల్లాలో 20పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 17 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. తాజాగా ఇద్దరు కోలుకున్నారు. కాకినాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి, పెద్దాపురానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి వైరస్‌ నుంచి కోలుకోవడంతో కాకినాడ జీజీహెచ్ నుంచి ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు.

వీరిద్దరు దిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే. మొత్తంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారినుంచి ముగ్గురు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 458 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మరో పక్క జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసారు. ఏపీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో 22.5 లక్షల మంది ఉన్నారని, భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని, కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డులో నిధులను వెచ్చించాలని కేంద్రం స్పష్టం చేసిందని, ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికుల అకౌంట్లను సేకరిస్తున్నారని, ఏపీలో కూడా కార్మికుల అకౌంటు నెంబర్లు సేకరించి రూ.5 వేలు చొప్పున అకౌంట్లలో జమ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు.

కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలోనూ రాజధాని తరలింపు ఆలోచన మాత్రం జగన్ సర్కారు మది నుంచి తొలగిపోవడం లేదని తెలుస్తోంది. తాజాగా మే 23న విశాఖకు సచివాలయం తరలించేందుకు కొత్త ముహూర్తం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కొంతమంది అధికారులు కూడా దీనిని నిర్ధారిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి మే మొదటి వారానికి పూర్తిగా నియంత్రణలోకి వస్తేనే అని వారంటున్నారు. విశాఖకు రాజధాని తరలింపు కొన్ని నెలలుగా చర్చల్లో ఉంది. మార్చి, ఉగాది... మే తొలి వారం... ఇలా అనేక ముహుర్తాలు మారగా, తాజాగా మే 23 వినిపిస్తోంది. ఆ రోజున రాజధానిని విశాఖకు తరలించాలన్న భావానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. అయితే ఒక్కసారిగా కరోనా అన్ని ప్రాంతాలను వణికిస్తుండడంతో తరలింపు ప్రక్రియ ఎంతవరకు సాగుతుందన్నది అనుమానంగానే ఉందని అధికారులు అంటున్నారు. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం కరోనా అదుపులోకి వస్తే అప్పుడు తరలింపుపై ఆలోచన వేగవంతం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలోనే మే నెలలో ముహూర్తానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ మే నెల్లో కాకపోతే ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వారు విశ్లేషిస్తున్నారు. అందుకే వీలయినంత వరకు మే నెలాఖరులోపే విశాఖకు తరలివెళ్లే అన్ని మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇక మరో పక్క, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే, ఉన్నట్టు ఉండి, రమేష్ కుమార్ ని తప్పించటం, గంటల్లోనే, కొత్త ఎలక్షన్ కమీషనర్ ని పక్క రాష్ట్రం నుంచి తీసుకురావటం, ఇలా అన్నీ చకచక జరిగిపోయాయి. ఇదంతా, వెంటనే పరిస్థితి కొంచెం అనుకూలంగా మారినా, ఎన్నికలకు వెళ్లిపోదామనే అని జగన్ ప్లాన్ గా తెలుస్తుంది.

అయితే మరో పక్క, జగన్ ప్లాన్స్ కి మోదీ గండి కొట్టారనే వాదన కూడా ఉంది. లాక్ డౌన్ పై రాష్ట్రాలకే విచక్షణాధికారాలు ఇస్తారన్న అంచనాలు తలకిందులు చేస్తూ, మరో మూడు వారాలు లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. ఏప్రిల్ 20 తర్వాత అత్యవసర సర్వీసులకే షరతులతో మినహాయింపులు ఇస్తామని, కరోనా పై కేంద్రం పకడ్బందీ వ్యూహంతో, జగన్ ప్లాన్స్ కి బ్రేకులు పడినట్టు తెలుస్తుంది. ఏపీలో మేలోగా రాజకీయ అజెండా అమలు చేయాలన్న ఆత్రంలో జగన్ ఉన్నారని, అయితే అది కుదరకపోవచ్చు అనే అభిప్రాయం ఉంది. ఏపీలో కరోనా కేసులు పెద్దగా లేవంటూ తక్కువ చేసి చూపే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నారని, టిడిపి కూడా ఆరోపిస్తుంది. అయితే, లాక్ డౌన్ మూడు వారాల పొడిగింపుతో సొంత అజెండా అమలుకు ఛాన్స్ లేదని అంటున్నారు. మరి మొండి పట్టుదలతో ఉన్న జగన్ ఏమి చేస్తారో చూడాలి.

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లా డౌన్లో సైతం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, స్థానికులు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, వారి ఇళ్ళల్లోనే దీక్షలు చేస్తున్నారు. అయితే రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలను ప్రభుత్వం, పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం రైతులు, మహిళలకు నోటీసులు జారీ చేశారు. మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు రైతులు, మహిళలు, స్థానికులు ప్రభుత్వంపై నిరసన గళం ఎత్తుతున్నారు. లాక్ డౌన్లో సైతం సామాజిక దూరం పాటిస్తూ ఎవరి ఇళ్ళ వద్ద వారే నిరసన చేస్తున్నారు. ఇటీవల వరకు ప్రైవేటు స్థలాల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ రైతులు, మహిళలు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని లాక్ డౌన్లో ఇలాంటి చర్యలకు దిగితే కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇప్పటి వరకు, నాలుగు నెలలు దాటుతున్నా, ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు అటు వైపు వెళ్తున్నా వారి వైపు కూడా చూడలేదు. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసు అధికారులు లాక్ డౌన్ నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తారంటూ రైతులు, మహిళలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు వెంకటపాలెంలోని యూనియన్ బ్యాంకు వద్ద అమరావతి జిందాబాద్ అంటూ చేసిన నినాదాలపై పోలీసు శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నోటీసులు ఇచ్చింది. మరోవైపు 12 నుంచి 15 మంది అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నారని లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి యధేచ్చగా బయటకు తిరుగుతున్నారని పోలీసు శాఖ ఆక్షేపించింది.

గుంటూరు జిల్లాలో సెక్షన్ 144తో పాటు పోలీసు యాక్ట్ అమలులో ఉందని మరోవైపు లాక్ డౌన్ నిబంధనలు కూడా ఉన్నాయని ఈ నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తారంటూ రైతులు, స్థానికులు, మహిళలకు పోలీసు శాఖ నోటీసులు జారీ చేసింది. చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. దీంతో మరోసారి అమరావతి ప్రాంతంలో అలజడి నెలకొంది. రైతులకు, మహిళలకు పోలీసు శాఖ నోటీసులు జారీచేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే రైతులు మాత్రం, ఈ నోటీసుల పై మండి పడుతున్నారు. తాము ఎక్కడా గుమికుడటం లేదని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తమ ఆందోళన ప్రభుత్వానికి చెప్తున్నామని అన్నారు.

రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకీ ఇబ్బందికరంగా మారుతుంది. కమ్యూనిటీ స్ప్రెడ్ వైపు అడుగులు వేస్తుంది అనే చెప్పాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అనంతపురం జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారికి కరోనా పాజిటివ్‌ రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ అధికారిని కలిసిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. అధికారి డ్రైవర్‌, అటెండర్‌, కార్యాలయ సిబ్బంది చిరునామాలు సేకరించి వారి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ అధికారికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఉద్యోగులతో పాటు, ఆయన్ను పదే పదే అనేక సార్లు కలిసిన రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. ఈఅధికారి, గత కొన్ని రోజులుగా, అక్కడి ఎమ్మెల్యేతో పలుసార్లు సమావేశమయ్యారని తెలుస్తుంది. ఆ అధికారితో పాటు పని చేసిన, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ అధికారులతో పని చేసిన వారి అందరినీ, వైద్యుల సమక్షంలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అవసరం ఉన్న వారికి టెస్టులు కూడా చేస్తునట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

గుత్తి పట్టణంలోని ఎస్​కేడీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న కరోనా అనుమానితులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ రాజశేఖరరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్​కేడీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని క్వారంటైన్‌లో ఉంటున్న కరోనా అనుమానితులు.. పోలీసులపై దాడికి దిగారు. తమను ఇళ్లకు పంపేవరకు భోజనం చేయబోమంటూ నిరసన తెలిపారు. గస్తీ కాస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్​ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు పంపిచడం వీలు కాదని పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనప్పటికీ వినకుండా పోలీసులపై మట్టి గడ్డలతో, రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో సీఐ రాజశేఖరరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. చివరికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి వారిని కేంద్రాలకే పరిమితం చేశారు.

అనంతపురం జిల్లాలో కరోనా నిర్ధరణ పరీక్షలను మరింత వేగవంతం చేసేందుకు మరో ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే వైద్య కళాశాలలో ఓ ప్రయోగశాల ఉండగా.. బత్తలపల్లి మండల కేంద్రంలోని ఆర్​డీటీ ఆసుపత్రిలో మరో ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇక్కడ రోజూ 3 షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తారని... రోజుకు 120 నమూనాలు పరీక్షించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. అనంతపురం వైద్యకళాశాల ప్రయోగశాలలోనూ 3 షిఫ్టుల్లో పనిచేసేలా సిద్ధమవుతున్నారు. ఇక మరో పక్క, అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కొవిడ్ - 19 మొబైల్ టెస్టింగ్ యూనిట్​ను ప్రారంభించారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్​ టెస్టింగ్​ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనంలో వైద్య సిబ్బందితో పాటు టెస్టింగ్ పరికరాలు అందుబాటులో ఉంటాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. Source: https://www.andhrajyothy.com/telugunews/corona-positive-to-tahsildar-2020041401235778

Advertisements

Latest Articles

Most Read