ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రభుత్వం పై అనేక ఆరోపణలు చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం, అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని, తమ పై కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. కేంద్రానికి కూడా ఈ విషయంలో ఫిర్యాదు కూడా చేసింది. ముఖ్యంగా కొంత మంది అధికారులు, పోలీసులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, వీరి ప్రవర్తనతో హైకోర్టు కూడా, ఈ రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా లేదా అని అడిగే పరిస్థితి ఉందని, రెండు సార్లు చీఫ్ సెక్రటరీని, మూడు సార్లు డీజీపీని హైకోర్టు కోర్టుకు పిలిపించింది అంటే, రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఎలా పని చేస్తుందో నిదర్శనం అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు, డీజీపీ మధ్య అలాగే ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ, తెలుగుదేశం నాయుడు జవహర్ మధ్య, మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపధ్యంలోనే ఈ రోజు మరో సంఘటన వెలుగులోకి రావటంతో, తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తప్పు తెలుసుకున్న ఆ అధికారి వెంటనే దాన్ని సరి దిద్దుకోవటంతో, వివాదం వెంటనే ముగిసిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు కృష్ణా జిల్లా కలెక్టర్ ట్విట్టర్ ఎకౌంటులో వేసిన ఒక పోస్ట్ తో, విజయవాడ ఎంపీ కేశినేని ఆగహ్రం వ్యక్తం చేసారు.
వైసిపీ పార్టీకి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన రాజకీయ వ్యాఖ్యలను, కృష్ణా జిల్లా కలెక్టర్ ట్విట్టర్ ఎకౌంటు షేర్ చేసింది. బండికోళ్ల లంక బ్యారేజి గురించి వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు లాగా కాంట్రాక్టర్ల వెంట పరిగెత్తకుండా, మా నాయుకుడు వైఎస్ జగన్ రైతుల జీవితాలు మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ, చేసిన కామెంట్స్ ని కృష్ణా జిల్లా కలెక్టర్ ట్విట్టర్ హేండిల్ షేర్ చేసింది. అయితే దీని పై విజయవాడ ఎంపీ కేశినేని నాని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తన ట్విట్టర్ ద్వారా కలెక్టర్ ని ప్రశ్నించారు. ఒక మాజీ సియం పై, ప్రత్యర్ధి పార్టీ చేసే రాజకీయ విమర్శలను మీరు ఎలా షేర్ చేస్తారు, మీరు ఒక ప్రభుత్వ అధికారి అనే విషయం గుర్తు పెట్టుకోవాలి అంటూ, కలెక్టర్ ట్వీట్ ని ఖండిస్తున్నట్టు ఎంపీ ట్వీట్ చేసారు. మీ తప్పుని సరిదిద్దుకొండి అని విజ్ఞప్తి చేసారు. దీంతో వెంటనే కృష్ణా జిల్లా కలెక్టర్ ఎకౌంటు నుంచి ఆ ట్వీట్ తొలగించబడింది. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్సహజంగా వివాదాలకు దూరంగా ఉంటారనే పేరు ఉంది. అయితే అధికారిక ఎకౌంటు నుంచి అత్యుత్సాహంతో చేసిన ట్వీట్ తో, విమర్శలు రావటం, వెంటనే దాన్ని సరి చేసుకోవటంతో, వివాదం ముగిసింది.