విభజన హామీల్లో పొందుపర్చిన కడప స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ మళ్లి పాతపాటే పాడారు. రెండు రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్లు నెలకొల్పడంపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ నివేదిక ఇచ్చేవరకు తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. తరువాత, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. బృందంలో కేవలం 10 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో ఎంపీ సీఎం రమేశ్ సహా తెదేపా ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వెళ్లి కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్న విషయాన్ని పొందుపరిచారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. చట్టంలో ఉన్నప్పుడు అమలు చేయడంలో ఇబ్బంది ఏంటని రాష్ట్రపతి ప్రశ్నించినట్టు తెదేపా నేతలు తెలిపారు. అలాగే ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేశ్ 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం కూడా తన దృష్టికొచ్చిందని రాష్ట్రపతి గుర్తుచేశారని తెలుగుదేశం నేతలు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్టు ఎంపీ సీఎం రమేశ్ మీడియాకు వివరించారు.
విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉందని, దీని పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కూడా రెండు రాష్ట్రాల్లో సాధ్యా సాధ్యాల పై అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ అన్నారు. తనను కలిసిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు, కడప జిల్లా నేతలతో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు జరుగు తున్న నేపథ్యంలో తాను స్టీల్ ప్లాంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయ లేనని తేల్చి చెప్పారు. అనం తరం అక్కడికి వచ్చిన మీడియా ప్రతి నిధులతో మాట్లా డుతూ టాస్క్ ఫోర్స్ నివేదిక వచ్చిన తర్వాతనే తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకు ఎంత సమయం పడుతుందని విలేకరులు ప్రశ్నించగా, టాస్క్‌ఫోర్స్ నివేదిక ఇచ్చేందుకు ఎటువంటి డెడ్‌లైన్ లేదని వ్యాఖ్యానించారు.
కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశపైం ఏపీ ప్రభుత్వం, కేంద్రం కొద్ది నెలలుగా సిగపట్లు పట్టుకుంటున్నాయి. 2014 ఏపీ రికగ్నైజేషన్ చట్టం (తెలంగాణ యాక్ట్)లో హామీ ఇచ్చిన విధంగా స్టీల్ ప్లాంట్ కడపలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, ఆ ప్రతిపాదనను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తోసిపుచ్చింది. ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ఏమాత్రం కలిసిరాదని కేంద్రం పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని ఇటీవల ఉపసంహరించుకుంది. అయితే కేంద్రం వాదనను ఏపీ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కనీసం 15 ఏళ్లయినా వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేని ప్రాజెక్టు ఇదని కుండబద్ధలు కొట్టింది. కడపలో ఇండిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపి సి.ఎం.రమేష్ కడపలో ఇటీవల 10 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేశారు.