ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం చెన్నై వెళ్లనున్నారు. గత కొన్ని రోజులుగా కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని పరామర్శించనున్నారు. తన చెన్నై పర్యటన ముగించుకుని సాయంత్రం తిరుపతి చేరుకోనున్నారు. ఎస్వీయూలో విద్యార్థులతో ‘జ్ఞానభేరి’ పేరిట ముఖాముఖి నిర్వహించనున్నారు. వారికి లక్ష్యాలను బోధించడంతో పాటు మెరుగైన పాలనకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు స్వీకరించనున్నారు. ఇప్పటికే కరుణానిధిని పరామర్శించిన వారిలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర రాష్ట్రాల నేతలు ఉన్నారు.
బ్లడ్ ప్రషర్ ఒక్కసారిగా పడిపోవడంతో జూలై 27న కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కోలుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు, ఆయనను పరామర్శించిన పలువురు నేతలు చెబుతున్నారు. మరో పక్క భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధిని పరామర్శించనున్నారు. ఈనెల 5న .కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శిస్తారు. రాష్ట్రపతి స్వయంగా కరుణానిధిని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుంటారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.