ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్ చేసిన ఒక కామెంట్ దేశ రాజకీయాలనే కుదిపేస్తోంది. నిజానికి ఫరూక్ చేసినది ఒక కామెంట్ కాదు.. చాలా రోజులుగా తన మదిలో దాచుకున్న రహస్యాన్ని ఆయన బైట పెట్టారు. జగన్ అధికార దాహం ఎలా ఉంటుందో ఆయన వెల్లడించారు. తండ్రి వైఎస్ చనిపోయిన కొన్ని రోజులకే జగన్ ప్రదర్శించిన పేరాశకు ఫరూక్ చెప్పిన మాటలే నిదర్శనం. ఫరూక్ వెల్లడించినది జగన్‌లోని ఒక కోణంలో ఒక శాతం మాత్రమే. చెప్పింది కొంతే వెల్లడించాల్సిందీ చాలా ఉందని ఫరూక్ అబ్దుల్లా చెప్పకనే చెప్పేశారు. ఫరూక్ ఒక రోజు పర్యటనలోనే మేజర్ ఇష్యూ బైటకు వచ్చేసింది. మరి ఇప్పుడేం జరగబోతోందనేది పెద్ద ప్రశ్నే. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి వచ్చే నేతలు ఏం చెప్పబోతున్నారు. త్వరలో రాబోయే ఎన్సీపీ నేత శరద్ పవార్.. ఇంతకంటే పెద్ద బాంబు పేల్చబోతున్నారా? పవార్ ఏం చెప్పబోతున్నారు? జగన్ వ్యవహారంలో ఇంతవరకు జరిగిందేమిటి?
ఇటు ఫరూక్ అటు పవార్.. ఇద్దరూ జగన్‌ను దగ్గర నుంచి చూసిన వాళ్లే. వైఎస్ చనిపోయినప్పుడు జగన్ లోక్ సభ సభ్యుడిగా ఉండేవారు. ఢిల్లీలో అందరితో మాట్లాడేవారు. అవసరం కోసం తెలివిగా అందరితో పరిచయం కూడా పెంచుకున్నారు. తండ్రి వైఎస్ మరణం తర్వాత సీఎం పదవి కోసం లాబీయింగ్ మొదలు పెట్టారు. శరద్ పవార్తోనూ తరచూ మాట్లాడేవారు. తొలుత ఫరూక్ అబ్దుల్లా ద్వారా కాంగ్రెస్‌కు గాలం వేయాలనుకున్నారు. జగన్ ప్రతిపాదన చూసి కాంగ్రెస్ నేతలే నోరు వెళ్లబెట్టే పరిస్థితి నెలకొంది. అప్పటికే జగన్ అవినీతి సంగతి తెలుసుకున్న సోనియా, సహా ఇతర నేతలు వైఎస్‌ను హెచ్చరించారు. అసలు జగన్ అవినీతి సంపాదనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది.. తాము హెచ్చరించడంతో వైఎస్ తన తనయుడిని దారికి తెచ్చి ఉంటారని అనుకున్నారు. అయితే వైఎస్ మరణం తర్వాత జగన్.. సీఎం పదవి కోసం నేరుగా 1500 కోట్ల ప్రతిపాదన చేయడంతో పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. అది జగన్ ప్రయత్నాల్లో పార్ట్ వన్ మాత్రమే..
వైఎస్ పాత మిత్రులైన శరద్ పవార్ లాంటి పెద్దలు జగన్‌ను దారికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం ఆయన కథలో పార్ట్ టూ అని చెప్పాలి. వైఎస్ చనిపోయిన కొద్ది రోజులకే జగన్ దూకుడును చూసి పవార్ విస్తుపోయారు. ఒక్కసారి పిలిచి మాట్లాడితే యువకుడైన జగన్ అర్థం చేసుకుంటారనుకున్నారు. అక్కడే పొరపాటు పడ్డానని ఆయనకు తర్వాత అర్థమైపోయింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటైన తర్వాత మళ్లీ జగన్ తీరు బైట పడుతోంది. చంద్రబాబు ఆహ్వానం మేరకు కూటమిలో భాగస్వాములైన పలువురు నేతలు ఏపీలో ప్రచారానికి వస్తున్నారు. ఫరూక్ వచ్చిన వెళ్లారు. పవార్ వస్తున్నారు. మమతా బెనర్జీ, దేవెగౌడ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ త్వరలో రాబోతున్నారు. పవార్ ఏం చెప్పబోతున్నారు? జగన్ నేచర్ ఎలాంటిదో ఆయన కుండబద్దలు కొట్టి చెప్పబోతున్నారా? మనకు తెలియని, ఏపీ ప్రజలు విస్తుపోయే నిజాలు వెల్లడించబోతున్నారా? ఢిల్లీలో జగన్‌తో పరిచయం ఉన్న నేతలంతా తలో నిజం బైటపెట్టబోతున్నారా? ఎందుకంటే అఖిలేష్ యాదవ్ లాంటి వారికి జగన్ నేచరేమిటో బాగానే తెలుసు కదా..? ఫరూల్ అబ్దుల్లా ఒక బాంబు పేల్చితే.. మిగతా వాళ్లు పది బాంబులు పేల్చబోతున్నారా ? జగన్ గతంలో పన్నిన వ్యూహాలు మరిన్ని బైటకు రాబోతున్నాయా?