మొన్నటి ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద మెజారిటీ సాధించి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ అధికారంలోకి వచ్చాయి. ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా, చివరకు జగన్ మోహన్ రెడ్డే నమ్మని విధంగా, వైసీపీ పార్టీకి, ఏకంగా 151 సీట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఫలితాల పై ఎవరి అనుమానాలు వారికి ఉండగా, ఒకసారి ఫలితం వచ్చిన తరువాత, అలాంటి వాదనలు ఇక చెల్లవు. జగన్ మొహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలవంతుడిగా ప్రస్తుతం ఉన్నారు. బీజేపీ లాంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలకు చుక్కలు చూపిస్తున్న టైంలో, వాళ్ళు కూడా వైసీపీ జోలికి వెళ్లి, ఎమ్మెల్యేలను లాక్కునే సాహసం చెయ్యటం లేదు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఇంత బలంగా ఉంటే, ఆ పార్టీ మంత్రులు మాత్రం, బీద అరుపులు అరుస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడేసే కుట్ర జరుగుతుంది అంటున్నారు. ఈ మాటలు కూడా అన్నది, ఫైర్ బ్రాండ్ లాంటి పేరు ఉన్న పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని. కొడాలి నాని లాంటి వారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడటంతో, సామాన్య ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా అవాకయ్యారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా ? కొడాలి నాని లాంటి వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటూ ఆరాలు తీస్తున్నారు. కొడాలి నాని నిన్న తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని, మీడియాతో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వాన్ని ఎదో రకంగా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. జగన్ ను ఇబ్బంది పెట్టటానికి, కొన్ని మీడియా సంస్థలు రకరకాలుగా కుట్రలు పన్నుతున్నారని, జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
అయితే తెలుగుదేశం పార్టీ కాని, బీజేపీ కాని, నిజంగా అంత మంది ఎమ్మేల్యేలను లాక్కుని, జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చెయ్యగలదా. దాదపుగా 75 మంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే కాని అది సాధ్యం కాదు. ఆ పరిస్థితి ప్రస్తుతం ఉందా ? మరి కొడాలి నాని ఆ మాటలు ఎందుకు అన్నారు ? ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు, ఇంత మెజారిటీ ఉన్న జగన్ ను ఎన్ని కుట్రలు చేసినా ఎవరు అస్థిరపరుస్తారు ? అయితే ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పాలన అంతా గాడి తప్పి ఉంది. ఒక పక్క ప్రజలు స్వచ్చందంగా రోడ్డు ఎక్కి ప్రతి రోజు నిరసనలు చేస్తూ, జగన్ ఇంటి ముందు కూడా ధర్నాలు చేస్తున్నారు. మరో పక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జగన్ ప్రభుత్వానికి చుక్కులు చూపిస్తుంది. కేంద్రం సహకరించటం లేదు. డబ్బులు లేవు, అవి పెంచే మార్గం జగన్ దగ్గర ఏమి లేదు. ఇవన్నీ చూస్తున్న నానికి, ఏమి చెయ్యాలో అర్ధం కాక, ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారని, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.