మాజీ ప్రధాన మంత్రి మరియు జెడిఎస్ అధినేత హెచ్.డి. దేవెగౌడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంకీర్ణ భాగస్వామిగా ఉన్నామని , లోక్ సభ ఎన్నికలను తన మిత్రపక్షంతో కలిసి పోరాడినట్లు దేవె గౌడ తెలిపారు . బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని అధికారంనుండి దించటానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా ఆయన స్వాగతిస్తామని తెలిపారు. దేవెగౌడ తన 85 వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే 23న కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ సమావేశానికి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని దేవెగౌడ తెలిపారు. ఒకవేళ అలాంటి సమావేశం ఉంటె అధికారిక ఆహ్వానం లేకపోయినా సమావేశంలో హాజరవుతానని ఆయన పేర్కొన్నారు.
అన్ని పక్షాలను, ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదకు తెచ్చే ప్రయత్నం సోనియా గాంధీ యొక్క "రాజకీయ పరిపక్వత" కు సాక్ష్యం అని ఆయన అభిప్రాయపడ్డారు . కేంద్రంలో ఎన్డీయే విఫలం అయితే ఎవరు ప్రధాని కావాలి అన్న అంశంపై మాట్లాడిన ఆయన ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వకుండా ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఇక బీజేపీయేతర కూటమిలోనూ చాలా ప్రాంతీయ పార్టీలున్నాయి. వాటిన్నటి మధ్య ముందు ఏకాభిప్రాయం రావాలి. మే 23 న సమావేశం జరిగితే సోనియా గాంధీకి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను అని దేవెగౌడ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోడీని ఓడించాలనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమవుతున్న తరుణంలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది . మరి కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా ఉన్నాయి. ఇక ఈ నేపధ్యంలో బీజేపీ ని గద్దె దించటానికి అన్ని పార్టీలు ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం వుంది. సోనియా సమావేశం అందుకు వేదిక అవుతుంది అని దేవెగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు . మొత్తానికి ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో స్టాలిన్ వెళ్లి అడిగితే షాకిస్తే, దేవెగౌడ మద్దతు అడగకముందే తమ మద్దతు ఎవరికో చెప్పి షాక్ ఇచ్చారు. అయితే వారం క్రితం, కేసీఆర్ కర్ణాటక వెళ్తారని, అక్కడ కుమారస్వామిని కలిసి, ఫెడరల్ ఫ్రంట్ కోసం మద్దతు అడుగుతారనే వార్తలు వచ్చాయి. ఎందుకో కాని కేసీఆర్ అటు వెళ్ళలేదు, ఇప్పుడు దేవగౌడ వ్యాఖ్యలు విన్న తరువాత వెళ్ళే అవసరం కూడా లేదు.