అక్రమాస్తుల కేసులో ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో వారిద్దరికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ములాయం, అఖిలేష్ యాదవ్ అక్రమాస్తుల కేసులో సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వారిపై సాధారణ కేసు నమోదు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ తన అఫిడవిట్ లో తెలిపింది. తమ విచారణలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదంది. 2013లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు నివేదిక ఇచ్చామని సీబీఐ అధికారులు తెలిపారు. దాంతో కేసు క్లోజ్ అయిందన్నారు.
తమ విచారణలో ఎలాంటి ఎవిడెన్స్ దొరకని కారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదని సీబీఐ అధికారులు చెప్పారు. 2013 ఆగస్టు తర్వాత అక్రమాస్తుల కేసులో ఎలాంటి విచారణ జరపలేదన్నారు. 2007లో ములాయం, అఖిలేష్ పై అక్రమాస్తుల కేసు నమోదైంది. 2005లో విశ్వనాథ్ ఛటర్జీ అనే రాజకీయవేత్త.. ములాయం, అఖిలేష్.. అక్రమాస్తులు సంపాదించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సీబీఐతో దర్యాఫ్తు చేయించాలని కోరారు. ములాయం, అఖిలేష్ వారి కుటుంబసభ్యులు అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు. 2005లో ఆయన పిటిషన్ వేశారు.
007లో.. అక్రమాస్తుల ఆరోపణలపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో అప్పటి నుంచి ఇప్పటివరకు సీబీఐ ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది. ఆస్తుల కేసులో పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని 2019 ఏప్రిల్ 11న సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై వివరణ ఇచ్చిన సీబీఐ.. 2013లోనే కేసుని క్లోజ్ చేశామని సుప్రీంకోర్టుకి చెప్పింది. అక్రమాస్తులకు సంబంధించి వారిద్దరిపై కేసులు నమోదు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ చెప్పడం ద్వారా.. వారిద్దరికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు అయ్యింది.