నేడు సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో, కౌంటింగ్ ఏజంట్లుగా నియమించబడ్డ వారు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ లో ఏజంట్లు, పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన, ఇదే విషయాన్ని తాను ముందు నుంచే చెబుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై నేతలకు దిశానిర్ధేశం చేశారు. కౌంటింగ్ చివరి క్షణం వరకూ ఏజంట్లు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని, ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించరాదని, పదుల సంఖ్యలో ఓట్ల తేడాతో విజయం దూరమయ్యే పరిస్థితి రావచ్చని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలుపును ఏ శక్తీ ఆపలేదని, అందరి శ్రమ, కార్యకర్తల పట్టుదల, కృషితో మరోసారి అధికారంలోకి రానున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరో పక్క, ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న కౌంటింగ్‌ను పర్యవేక్షించేందు కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఢిల్లీ, అమరావతిలో ఆ పార్టీ అధిష్ఠానం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్‌లు సమాచారాన్ని క్షేత్రస్థాయికి అందించనున్నాయి. కౌంటింగ్‌లో పొరపాట్లు, అవకతవకలు జరిగితే ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు టీడీపీ తమ పార్టీ నేతలను సిద్ధంగా ఉంచింది. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసం నుంచే కౌంటింగ్‌ను పర్యవేక్షించనున్నారు.