విజయవాడ నడిబొడ్డున ధర్నా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై జరుగుతున్న ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ, ఆయన నిరసనకు దిగాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర సంస్థల దాడులకు నిరసనగా ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకునారు చంద్రబాబు నాయుడు . కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ తమపై దాడులకు యత్నిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసే కుట్రలో భాగంగా కేంద్ర సంస్థలను రంగంలోకి దింపింది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీన్ని ఇంతటితో ఆపేదిలేదని నిరసనలు కొనసాగుతాయని చెప్తున్నారు. పౌరుషానికి ప్రతీకగా శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహిద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కొంటామనే స్ఫూర్తితో, తెలుగుజాతి కీర్తిని చాటుతూ ఈ కాగడాల ప్రదర్శనలు సాగాలని దిశానిర్దేశం చేశారు. 7న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రార్థనలు, పూజలు నిర్వహించాలని, కుట్రలపై సర్వమతాలు తమకు అండగా నిలుస్తున్నాయని సీఎం ఆకాంక్షించారు. గురువారం పూజారులు, క్రైస్తవ, ముస్లిం మతపెద్దలు కలిసి తమకు సంఘీభావం తెలిపారని.. రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలకు అన్ని మతాల వారిలోనూ కోపం, ఆవేదన ఉన్నాయన్నారు. జగన్ తమతోనే ఉంటాడని భాజపా నేతలు చెప్పడం ముస్లిం మైనార్టీల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచిందని సీఎం అన్నారు. 8, 9 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వీర తిలకం దిద్ది పౌరుషాన్ని రగిల్చాలని సీఎం సూచించారు. దేనికీ భయపడాల్సిన పనిలేదని, విజయం పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నామన్నారు.
గురువారం టీవీలో కొన్ని సంఘటనలు చూస్తే అసహ్యం వేసిందని, వ్యక్తిగత జీవితాలను దిగజార్చుకుంటూ దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. క్యారెక్టర్ లేని వారంతా వైకాపాలోనే ఉన్నారని, అరాచకశక్తిగా మారిన వైకాపాను ఎదుర్కొంటూనే ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ముందుకు సాగాలని నేతలకు సూచించారు. కాగా, గత కొన్ని రోజులుగా పలువురు టీడీపీ నాయకులపై ఐటీ, పోలీసుల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులతో పాటు నారాయణ విద్యా సంస్థలు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసం తదితర ప్రాంతాల్లో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీతో కుమ్మక్కయిన బీజేపీ, ఈసీని వాడుకుంటూ ఈ దాడులు చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.