దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల నిర్వహణ రాష్ట్రంలోఉన్న తీరుగా లేదని, అడుగడుగునా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతున్నా, అధికారపార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా, అధికారయంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి దాస్యం చేస్తున్నా, ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీనేత, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, అధికారులు విచ్చలవిడిగా నియమావళిని ఉల్లంఘిస్తున్న ఘటనలు కోకోల్లలుగా ఉన్నాయని, వాటన్నింటినీ ప్రతి గంటకోసారి మీడియాకు వెల్లడించాలని టీడీపీ నిర్ణయించుకుందని దీపక్ రెడ్డి చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సంఘటనలను మీడియాసాక్షిగా ఎన్నికల సంఘం, ప్రజల ముందుంచుతున్నామని, ఎన్నికల్లో గెలుపుకోసం ఎవరు అడ్డదారులు తొక్కుతున్నారో వారే తేల్చాలని ఆయన సూచించారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబసభ్యుడైన పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, టీడీపీతరుపున పోటీచేస్తున్న అభ్యర్థిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని, నామినేషన్లు వేయడానికి వెళ్లిన సదరు అభ్యర్థిపై దాడిచేయడమేగాక, అతనిచేతిలోని నామినేషన్ పత్రాలు లాగేసుకున్నాడని దీపక్ రెడ్డి పేర్కొన్నారు. (సుధీర్ రెడ్డి దాడిలో గాయపడిన వ్యక్తిని, అతనికి అయిన గాయాల ఫొటోలను ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు.)
పట్టపగలే మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి, అధికారుల సమక్షంలో ఇంతటి ఘాతుకానికి పాల్పడినా, పోలీసులుగానీ, ఎన్నికల సంఘంగానీ అతనిపై ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే, రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నట్టా..లేనట్టా అనే అనుమానం ప్రజలందరికీ కలుగుతోందన్నారు. నామినేషన్లు వేయడానికి అవసరమైన పత్రాలు ఇవ్వకుండా నిన్నటివరకు అధికారులు వేధిస్తే, ఎలాగోలా అవి తీసుకొని నేడు నామినేషన్లు వేయడానికి వెళితే, అక్కడ దాడిచేయడం జరిగిందని దీపక్ రెడ్డి తెలిపారు. ఈ ఒక్క సంఘటనే కాదని, ఇలాంటివి అనేకం ఉన్నాయని, నేటి నుంచి (11-03-2020) ప్రతిరోజూ అధికారపార్టీ దౌర్జన్యాలను, దుర్మార్గాలను ఆధారాలతో సహా పత్రికాముఖంగా బయటపెట్టడమే తమ పని అని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో వైసీపీ పట్టణ అధ్యక్షుడైన వెంకటరమణ అనేవ్యక్తి, టీడీపీకి చెందిన బీసీ మహిళా అభ్యర్థికి ఫోన్ చేసి దూషించాడని, నామినేషన్ వేస్తే, ఆమె ఇంటిని కూలగొడతామని హెచ్చరించడం జరిగిందన్నారు. (దీనికి సంబంధించి వైసీపీనేత, సదరు మహిళా అభ్యర్థిని బెదిరించిన ఆడియో క్లిప్ (ఇరువురిమధ్య ఫోన్లో జరిగిన సంభాషణ) ను విలేకరుల సమావేశంలో వినిపించారు) చిత్తూరుజిల్లాలో రేణిగుంట ఎమ్మార్వో విజయసింహారెడ్డి నిన్నటివరకు తమపార్టీవారికి నామినేషన్లకు అవసరమైన ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా తప్పించుకు తిరిగాడని, మేము ఈసీకి ఫిర్యాదుచేయడంతో ఆఖరినిమిషంలో అవి మంజూరుచేసి, తనకు ప్రోటోకాల్ ఉందంటూ నామినేషన్లు తీసుకోకుండా వెళ్లపోయాడన్నారు.
ఎన్నికల నిబంధన అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రోటోకాల్ ఉండదని, కానీ సదరు ఎమ్మార్వో మాత్రం, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోకూడదనే కావాలనే కుంటిసాకుచెప్పి తప్పించుకున్నాడన్నారు. హైకోర్టు ఆదేశాలొచ్చి 24 గంటలవుతున్నా, నేటికీ శ్రీకాళహస్తిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర భవనాలకున్న వైసీపీ రంగులను తొలగించలేదన్నారు. చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో టీడీపీ అభ్యర్థులు ఉదయం నుంచి అధికారుల కార్యాలయాల ఎదుట వేచిచూస్తున్నా, వారి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోలేదని, ఇదంతా కావాలని చేయడం కాదా అని దీపక్ ప్రశ్నించారు. అదే జిల్లాలోని జీ.డీ.నెల్లూరులో తమపార్టీకి చెందిన అభ్యర్థి రవీంద్రకుమార్ నామినేషన్ పత్రాలు తీసుకొని, రిసీవ్ డ్ అని స్టాంపువేసి, అతనికి రసీదు ఇచ్చారని, తరువాత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పీ.ఏ.సుబ్రహ్మణ్యం చెప్పాడంటూ, నామినేషన్ పత్రాలను అధికారులు వెనక్కు ఇచ్చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకోల్లలుగా జరుగుతుంటే, ఎన్నికల సంఘం ఏం చేస్తోందని, మంత్రులే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తుంటే, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని దీపక్ రెడ్డి మండిపడ్డారు.
ఎన్నికలసంఘానికి తాము ఇప్పటివరకు అనేకఫిర్యాదులుచేశామని, వాటిపై ఇంతవరకు స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చినప్పటినుంచీ, తమపార్టీ తరుపున తాముచేసిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ ఏవిధమైన చర్యలు తీసుకోలేదని, కాబట్టి వాటిని పత్రికాముఖంగా ప్రజలముందుకు తీసుకెళ్లి, అనంతరం హైకోర్టు ముందుంచాలని నిర్ణయం తీసుకున్నామని టీడీపీ ఎమ్మెల్సీ తేల్చిచెప్పారు. నేటి (11వతేదీ) సాయంత్రం లోగా ఎన్నికల సంఘం నిద్రమేల్కొని, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై, అధికారయంత్రాంగాన్ని, పోలీసులను తమదౌర్జన్యాలకు ఉపయోగించుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా జరుగుతున్న సంఘటనలపై ఈసీ ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యలను మీడియాకు వెల్లడించాలన్నారు. అధికారులు తాము పనిచేయమని చెబుతున్నా, కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వమంటున్నా, నామినేషన్లు తీసుకోమని బహిరంగంగానే చెబుతున్నా, ఎన్నికల సంఘం ఎందుకుపట్టించుకోవడంలేదో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ ఆధారాలతో సహా వెల్లడిస్తున్న ఘటనలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే, తక్షణమే ఎన్నికలను నిలిపివేయాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈసీ, పోలీస్ స్పందించక పోవటంతో, ఇక కోర్ట్ కు వెళ్ళటమే మిగలి ఉందని చెప్పారు.