పోలవరాన్ని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ నేతలు చేయని కుట్రలు, కుతంత్రాలు లేవని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు ఒడిశాతో చేతులు కలిపి అడ్డంకులు కల్పించారని వ్యాఖ్యానించారు. సుమారు రూ.5,200 కోట్ల ఏపీ విద్యుత్ ను తెలంగాణ వాడుకుందనీ, అయినా బిల్లును ఇంకా చెల్లించలేదనీ, అడిగితే దిక్కు ఉన్నచోట చెప్పుకోండి అని కేసీఆర్ చెబుతున్నారని తెలిపారు. ఏపీ స్థానికత ఉన్న 1,200 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు రోడ్డుపైకి పంపేస్తే జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పండుగ దినాన కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడని విమర్శించారు. అధికారం కోసం కక్కుర్తి పడి, ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టి జగన్ కేసీఆర్ తో చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన పాదయాత్రలోనే వైసీపీకి ఏపీ ప్రజలు ముగింపు పలికారని ఎద్దేవా చేశారు. అందుకే చివరి అస్త్రంగా ఏపీ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడానికి జగన్ పూనుకున్నారని దుయ్యబట్టారు. రిమోట్ కంట్రోల్ గా జగన్ ను ఇక్కడ పెట్టుకుని ఏపీ ప్రజల మీద పెత్తనం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఖబర్దార్ ఆంధ్రా ద్రోహుల్లారా.. ఖబర్దార్ అని హెచ్చరించారు. రాష్ట్ర విభజన తర్వాత చెట్ల కింద తాము పరిపాలన చేశామని అన్నారు. ప్రజల రాజధాని అమరావతి జగన్ కు మాత్రం భ్రమరావతిగా మారిందని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు రమ్మంటే జగన్ ఆహ్వాన పత్రికను కూడా తీసుకోలేదని తెలిపారు.
ఏపీకి ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తామని చంద్రబాబు చెప్పారని ఉమ గుర్తుచేశారు. అందువల్లే ఈరోజు పోలవరం కల సాకారం అయిందని తెలిపారు. అయితే తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ ఏడు మండలాలను చంద్రబాబు లాక్కున్నాడని కేసీఆర్ తిట్టారనీ, అలాంటి వ్యక్తితో కలిసి జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2014లో వైసీపీ టికెట్ పై గెలిచిన అభ్యర్థులను జగన్ టీఆర్ఎస్ లో పంపారని ఆరోపించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లజెండా ఎత్తి టీఆర్ఎస్ కు సహకరించారని దుయ్యబట్టారు. ఈరోజు నిసిగ్గుగా పండుగ రోజున బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రంకులు, బొంకులు దాగవనీ, గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ రంగు, బొంకు రాజకీయాలు ఇప్పుడు బయటపడ్డాయని చెప్పారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడానికి జగన్ ఫెడరల్ ఫ్రంట్ బాగోతానికి తెరలేపారని టీడీపీ నేత, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కేసీఆర్ ప్రారంభిస్తామని చెబుతున్నకూటమి ఫెడరల్ ఫ్రంట్ కాదనీ, అది మోదీ ఫ్రంట్ అని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు మీద కక్షతో, టీడీపీని దెబ్బతీయాలన్న ఆలోచనలతో ముగ్గురు మోదీలు(మోదీ కేసీఆర్ జగన్) జగన్నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ‘తెలంగాణలో కలవని జాతి ఒకటే ఒకటి అది ఆంధ్రోళ్ల జాతి’ అని కేసీఆర్ దుషించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తులతో జగన్ చేతులు కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు. ఆంధ్రా కుక్కల్లారా.. 24 గంటల్లో వెళ్లిపోండి. లేదంటే తన్ని వెళ్లగొడతా.. అని కేసీఆర్ కామెంట్ చేశారని ఉమ గుర్తుచేశారు. తాము ఎద్దులు, ఆవులకు పెట్టే ఉలవచారును ఆంధ్రా వాళ్లు తింటారని కేసీఆర్ చెప్పారన్నారు. నన్నయ్య ఆది కవి అంట.. అసలు అతను కవే కాదు అంటూ కేసీఆర్ అవమానించారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తితో చేతులు కలపడానికి జగన్ కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో సీమాంధ్రులు ఎప్పటికైనా కిరాయిదారులే అని చెప్పారు. ‘జగన్మోహన్ రెడ్డి.. ఇది నీకు వినిపిస్తుందా?’ అని ప్రశ్నించారు. ‘నగదు, కాంట్రాక్టులకు కక్కుర్తి పడి ఎంతకు దిగజారిపోయావ్ జగన్మోహన్ రెడ్డి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా బాపనోళ్లకు మంత్రాలు కూడా తెలియని కేసీఆర్ ఇప్పుడు అక్కడకు వచ్చి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు అడుగులు కాదు.. నాలుగు వేల అడుగులు ముందుకు వేసినా జగన్ కు ప్రజలు గుణపాఠం చెప్పితీరుతారని హెచ్చరించారు. ఈరోజు ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి జగన్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.