అమరావతి.. ఇది ప్రజా రాజధాని... రైతుల త్యాగాల పై, ఆంధ్రుడి కసిలో నుంచి పుట్టిన రాజధాని.. దీని పై మొదటి నుంచి కొంత మందికి మంట.. భ్రమరావతి అంటూ ఎగతాళి చేస్తారు. అయినా అవేమి పట్టించుకోకుండా, వారి ఏడుపులే దీవెనలుగా, వారి మొఖాలే అమరావతికి దిష్టి బొమ్ములుగా ముందుకు సాగుతుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎన్జీవోల నివాస గృహ సముదాయాలు, నగరంలో పట్టణ పేదల కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సముదాయాలు, ప్రస్తుతం కార్యకలాపాలు జరుగుతున్న సచివాలయం, అసెంబ్లీ భవనాలు, నిర్మాణంలోని హైకోర్టు భవనం, విశాలమైన రహదారులు, శాశ్వత ప్రాతిపదికన నిర్మించబోయే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల టవర్ల కోసం వేసిన ర్యాఫ్ట్ ఫౌండేషన్, ఇలా అనేక పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్ అంతా చూస్తున్న ప్రపంచం, అమరావతిని ఫ్యూచర్ సిటీగా గుర్తిస్తుంది.
కెనడాలోని మాంట్రియల్‌కి చెందిన ‘న్యూ సిటీస్’ సంస్థ నిర్వహిస్తున్న ‘వెల్ బీయింగ్ సిటీ’ అవార్డుల పోటీలో ఒక విభాగంలో తుది పోటీలో నిలిచిన నాలుగు నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మొదటి ర్యాంక్ దక్కించుకుంది. ‘ఆర్థికాభివృద్ధి- అవకాశాలు’ కేటగిరీలో అమరావతికి తొలి ర్యాంకు దక్కింది. తర్వాతి స్థానాల్లో షికాగో (అమెరికా), జుబ్‌జానా (స్లొవేనియా), పుణె(భారత్) ఉన్నాయి. ‘న్యూ సిటీస్’ సంస్థ మొదటిసారి ఈ పోటీలు నిర్వహిస్తోంది. మొత్తం నాలుగు కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలకు చెందిన 100 నగరాలు తలపడుతున్నాయి.
ఈ విభాగాల్లో 16 నగరాల్ని తుది పోటీకి ఎంపిక చేశారు. ‘ఆర్థికాభివృద్ధి-అవకాశాలు’ కేటగిరీలో అమరాతి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. ఈ విభాగంలో అమరావతి మొదటి ర్యాంకులో నిలిచిందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతి కేటగిరీలో ఒక నగరాన్ని, మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఒక అత్యుత్తమ నగరాన్ని ఏప్రిల్‌లో ఎంపిక చేస్తారు. 2019 జూన్ లేదా జులైలో మాంట్రియల్‌లో జరిగే అంతర్జాతీయ వేడుకలో అవార్డులు అందజేస్తారు. మన అమరావతి ఇలాగే దినదినాభివృద్ధి చెందాలి, ఆంధ్రా వాడి దమ్ము, ప్రపంచమంతా తెలియాలి, చంద్రబాబు కష్టం ఫలించాలని కోరుకుందాం..