వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఎకనామిక్స్, సోషియాలజీ తెలియదని అన్నారు. అన్నీ ఇచ్చేస్తామని ఆయన కబుర్లు చెబుతున్నారని, ఇలాంటి అనుభవశూన్యులతో భవిష్యత్‌కు ప్రమాదమని చంద్రబాబు అన్నారు. మంగళవారం సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు... సాధించిన ప్రగతిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ కన్నా... అన్న క్యాంటీన్లలోనే శుభ్రత, నాణ్యత ఎక్కువని చెప్పారు. ఇంత తక్కువ ధరకు రుచికరమైన భోజనం అందిస్తున్న... క్యాంటీన్లు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు.
ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత రాజధానికి ఖర్చు చేస్తే... సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేమని సీఎం అన్నారు. అందుకే కొత్త పద్ధతుల్లో రాజధాని కోసం నిధులు సమీకరిస్తున్నామని, ఇలాంటి విధానాల్లోనే ఏపీ గెలుపు ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేసిన సమయంలో రైతుల కష్టాలు చూశామన్నారు. ఆర్థిక అసమానతలతో బాధపడుతున్నారని, అందుకే సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కరణలద్వారా వచ్చే ఫలితాలను.. సంక్షే్మ కార్యక్రమాల ద్వారా, ఆర్థిక అసమానతలు తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వానికి, సమాజానికి అతి ముఖ్యమైనది సంక్షేమమని అన్నారు.
సామాజిక కారణాలు, చారిత్రక, భౌగోళిక కారణాలతో... పేదరికం, ఆర్థిక అసమానతలతో ఇబ్బంది పడుతున్నారని, సంపద సృష్టించకుండా పేదరికం పోదని, సంపద సృష్టించగలిగితే పేదరికం తొలగిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనాథలైనా.. బిడ్డలు పట్టించుకోని తల్లిదండ్రులైనా.. వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటోందని, తాను పెద్దకొడుకులా కాపాడుకుంటానని మాటిస్తున్నానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను పెంచామని, నిధుల కన్వర్జెన్సీ ద్వారా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రజలకు సంతృప్తకర స్థాయిలో నిత్యావసరాల్ని అందిస్తూ... ప్రజాపంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో 66 శాతం సంతృప్తి వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టామని, జగ్జీవన్‌రామ్ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రన్నబీమా పథకం క్లయిమ్స్‌లో 94 శాతం సంతృప్తికరంగా ఉందన్నారు. పెద్దఎత్తున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.