చంద్రబాబు ఎన్నికల చివరి రోజు, ఒక మాట చెప్పారు.. అది గుండెల లోతుల్లో నుంచి వచ్చిన మాట.. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం, భవిషత్తు తరాల కలల రాజధాని అమరావతి శాశ్వతం, నిర్మాణం అవుతున్న పోలవరం శాశ్వతం, సీమలో పారే కృష్ణా నీళ్ళు శాశ్వతం, అలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని. అయితే ప్రజలు మాత్రం, ఆయన మాటలు విశ్వసించకుండా, వేరే నిర్ణయం తీసుకున్నారు. అమరావతి, పోలవరం సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోవాలి. నిజంగానే చంద్రబాబు చెప్పినట్టు ఆయన శాశ్వతం కాదు కాని, ఆయన హయంలో నిర్మించినవి మాత్రం శాశ్వతం. అవే మన రాష్ట్రానికి పేరు తీసుకు వస్తాయి. ఈ రోజు చంద్రబాబు లేకపోయినా, ఆయన నిర్మించిన వ్యవస్థ పై, అటు కేంద్ర మంత్రులు, ఇటు క్రికెటర్లు కూడా మాట్లాడుతున్నారు.
విషయం ఏమిటి అంటే, వారం రోజుల క్రిందట, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో, వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు, మేము మీ రాష్ట్రానికి ప్రత్యేకంగా, ఏమి పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేం, కాని మీ వైజాగ్ లో, ఉన్న ఏపి మెడ్ టెక్ జోన్ మాత్రం, అద్భుతంగా పని చేస్తుంది, దానికి ఏమైనా ప్రతిపాదనలతో రండి, మీకు సహకరిస్తాం అంటూ, చంద్రబాబు కష్టపడి కట్టిన ఏపి మెడ్ టెక్ జోన్ పై ప్రశంసలు కురిపించారు. అయితే, అదే విషయం పై, నిన్న, టీం ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేసారు. "Thank you Gadkari ji for this acknowledgement. Yes, with ecosystem like A.P. Med Tech Zone and health champions like Dr Jitendar Sharma, this dream of making India - a health superpower is possible" అంటూ ట్వీట్ చేసారు.
ఇప్పుడు చంద్రబాబు అధికారంలో లేరు, కాని ఆయన స్థాపించిన వ్యవస్థల పై మాత్రం, అందరూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక రాజధానిగా పేరున్న విశాఖను, దేశంలోనే ఓకే మెడికల్ హబ్‌గా తీర్చి దిద్దాలనే, లక్ష్యంతో ఏపి మెడ్‌టెక్ జోన్‌ను, డిసెంబర్ నెలలో చంద్రబాబు ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్క్‌కు సాగర తీరం కేంద్రం కావడం విశేషం. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇంజక్షన్ ల దగ్గర నుంచి, ఆస్పత్రులలో వినియోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇలా అన్నీ ఒకేచోట ఉండటం ఈ పార్కు ప్రత్యేకత. చంద్రబాబు అది ప్రారంభించిన టైంలో, దాదపుగా 80 కంపెనీలు అక్కడ ఉత్పత్తి ప్రారంభించాయి. ఇప్పుడు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు, దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని ఆశిద్దాం.