మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వాధి నేత, జగన్ మోహన్ రెడ్డి పై అక్రమాస్తుల కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అఫిడవిట్ లో తెలిపిన వివరాలు ప్రకారం మొత్తం 31 కేసులు ఉన్నాయి. అందులో అక్రమాస్తులకు సంబంధించి 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్నాయి. దాదపుగా 16 నెలలు జైల్లో కూడా గడిపి వచ్చారు జగన్ మోహన్ రెడ్డి. తరువాత కోర్ట్ ఆయనకు కండీషనల్ బెయిల్ ఇచ్చింది. ఈ కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి A1 కాగా, విజయసాయి రెడ్డి A2 గా ఉన్నారు. మొన్నటిదాక ప్రతి శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కోర్ట్ విచారణకు వెళ్ళే వారు. అయితే, ఆయన ప్రభుత్వంలో బిజీ అయిన దగ్గర నుంచి, ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళటం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా విచారణకు వెళ్ళలేదు.
జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వ బాధ్యతలు ఉంటాయి కాబట్టి వెళ్ళటం లేదు, మరి విజయసాయి రెడ్డి కూడా ఎందుకు విచారణ హాజారుకావటం లేదో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, జగన్ మోహన్ రెడ్డి కండీషనల్ బెయిల్ పై బయట ఉండటంతో, ఆయన విదేశాలకు వెళ్ళాలి అంటే ముందుగా కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి. కోర్ట్ ఒకే అంటేనే జగన్ బయటకు వెళ్ళగలరు. అదీ కాక, కోర్ట్ కొన్ని షరతులు కూడా విదిస్తుంది, వాటిని కూడా ఒప్పుకోవాలి. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి తాను విదేశాలకు వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వండి అంటూ సిబిఐ కోర్ట్ లో అర్జీ పెట్టుకున్నారు. దీని పై సిబిఐ కోర్ట్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళటానికి అనుమతులు ఇస్తూనే, కొన్ని షరతలు కూడా పెట్టింది.
ఆగస్టు ఒకటో తేది నుంచి ఆగష్టు 25వ తేదీ మధ్య జెరూసలెం, అమెరికా వెళ్లేందుకు జగన్ మోహన్ రెడ్డికి , సిబిఐ కోర్ట్ అనుమతి ఇచ్చింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు అనుమతి ఇచ్చారు. అయితే జగన్ మోహన్ రెడ్డి పర్యటన సమయంలో, సెల్‌ఫోన్, ల్యాండ్ ఫోన్, ఈమెయిల్, ఫ్యాక్స్ నంబర్లను కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని షరతు పెట్టారు. మరో పక్క ఇదే కేసులో A2 గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా, తాను కూడా విదేశాలకు వెళ్ళాలని కోర్ట్ ని కోరటంతో, విజయసాయి రెడ్డికి కూడా విదేశాలకు వెళ్లేందుకు కోర్ట్ అనుమతి ఇచ్చింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30లోగా 50 రోజులపాటు అమెరికా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రే లియా తదితర దేశాల్లో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది. ఇదే సందర్భంలో ఆయనకు కూడా షరతులు ఇచ్చింది. రూ.2 లక్షల పూచీకత్తుతో బాండు సమర్పించాలని, పర్యటన వివరాలను, టెలిఫోన్ నంబర్‌ను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని, వచ్చాక పాస్‌పోర్టును కూడా ఇచ్చేయాలని షరతు విధించారు.