రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ లేఖ రాసారు. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ లేఖ రాసినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సీఎస్ నీలం సాహ్ని ఈ లేఖలో పేర్కొన్నారు. మరో 3, 4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు యథావిధిగా నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టాలని, ఆమె ఎలక్షన్ కమీషనర్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె లేఖలో తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేస్తూ, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని సూచించారు. జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని అన్నారు. మరో 3, 4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని, అందుకే అనుకున్న ప్రకారం ఎన్నికలు జరపాలని లేఖలో పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ స్పందించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం విధులను అడ్డుకోవడమేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగానే ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిపారు. కమిషన్ ఏ కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ లేఖ విడుదల చేశారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రమేష్‌కుమార్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం విధులు అడ్డుకోవడమేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు వ్యవస్థలను బలహీపరుస్తాయన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థన్న ఎస్ఈసీ. .. హైకోర్టు న్యాయమూర్తికి ఉండే అన్ని అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంటాయని తెలిపారు.
కరోనా వైరస్ ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించినందునే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏ కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ రెండు పేజీల పత్రికా ప్రకటనను విడుదల చేసింది. జాతీయ స్థాయి యంత్రాంగంతో చర్చించిన తర్వాతే ఎన్నికలను వాయిదా వేసినట్లు రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, జోక్యం చేసుకుని ఆదేశాలను నిలుపుదల చేయాలని గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తన నిర్ణయంపై ఎన్నికల కమిషనర్ వివరణ ఇచ్చారు. కేంద్రం విపత్తు ఆదేశాలు ఉపసంహరించిన తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉంటుందని.. ఈ సమయంలో వ్యక్తి గత లబ్ది చేకూర్చే ఏ పథకాన్ని అమలు చేయకూడదని రమేశ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో భారత ఎన్నికల కమిషన్ పాటించిన మార్గదర్శకాలనే తాము పాటిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం నియమావళికి విరుద్ధమని అందుకే పట్టాల పంపిణీకి అనుమతించలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలను నిలుపుదల చేశామని... రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆరు వారాలలోపే కరోనా ప్రభావం తగ్గితే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పోలీసులు, అధికారులపై వేటు వేయడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో దానిపైనా రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల్లో హింస జరిగిందని పలు రాజకీయ పార్టీలు తమకు ఫిర్యాదు చేశాయని లేఖలో ఎస్ఈసీ తెలిపారు. ఎన్నికల్లో హింస ఘటనపై హైకోర్టు లోనూ వాజ్యం విచారణలో ఉందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను సైతం ప్రతివాదులుగా చేర్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయని.. ఇదే విషయమై కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చెప్పిన అంశాలనే తాము పాటిస్తున్నట్లు తెలిపారు. నేడు రమేశ్ కుమార్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. సీఎం జగన్ లేవనెత్తిన అభ్యంతరాలపై గవర్నర్ చర్చించే అవకాశం ఉంది.