రాజధాని రైతాంగం న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. రాజధానిపై జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్రప్ర భుత్వ వైఖరిని సవాల్ చేస్తూ హైకోర్టులో వందల సంఖ్యలో రిట్ పిటిషన్ను ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయాలని యోచిస్తున్నారు. రాజధాని పరిధికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు కార్యాలయంలో దాదాపు 20మంది న్యాయవాదులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు వేర్వేరు కారణాలతో విడివిడిగా హైకోర్టులో రిట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతులంతా వేర్వేరు కారణాలతో రిట్లు దాఖలు చేస్తే న్యాయమూర్తి దృష్టికి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా తీసుకెళ్ళే వీలు కలుగుతుందనేది వారి అభిప్రాయం. ఈ రిట్లతో పాటు ప్రతి గ్రామం నుంచి ఒక రైతు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
హైకోర్టులో న్యాయ సహాయం చేసేందుకు ఇప్పటికే 20మంది న్యాయవాదులు సంసిద్ధత వ్యక్తం చేశారని, వారంతా ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదికపై 'రిట్' లలో ప్రస్తావించాలని న్యాయవాదులు సూచిస్తున్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి కేవలం తన అభిప్రాయంగానే చెప్పినందున దానిపై హైకోర్టులో రిట్ వేస్తే తిరస్కరణకు గురయ్యే ప్రమాదముందని, అందువల్ల ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు వేచి చూసి అనంతరం దానిపై నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు భావిస్తున్నారు. ఈ నెల 27న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాజధాని విషయమై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.
జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ సంస్థ అధ్యయన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చింగలరని భావిస్తున్నారు. అయితే కమిటీ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలో రాజధానిలో అభివృద్ధి అంశాన్ని చేర్చినందున దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని న్యాయవాదులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి రైతులు హైకోర్టు న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరో పక్క, ఇప్పటికే ఒక కేసు హైకోర్ట్ లో నడుస్తుంది. దానికి సంబంధించి, ఇప్పటికే హైకోర్ట్, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చెయ్యమని కోరింది. రైతులు అన్ని విధాలుగా, వారికి తోచిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుందో రాదో మరి.