సూది కోసం సోది చెప్పించుకుంటే పాతవి అన్నీ బయట పడ్డాయని, పెద్దల మాట. సరిగ్గా వైసీపీ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. రాజ్యసభలో వైకాపా పరిస్థితి మాత్రం కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లయింది. ఇందుకు ఆపార్టీ కీలకనేత అయిన విజయసాయిరెడ్డే సూత్రధారి కావడం యాధృచ్చికమా...? వ్యూహాత్మకమా...? అన్న ప్రశ్నలు కీలకంగా రాజకీయ వర్గాల్లో సంచరిస్తున్నాయి. సోమవారం రాజ్యసభ సమావేశంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్న ఆయనకే కాక వైకాపా మెడకే చుట్టుకుంది. పోలవరం విషయంలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కారణమైంది. ఇదంతా వైకాపాలో అసమ్మతి అని, విజయసాయి వేసిన ఎత్తుగడని కొందరు వాదిస్తుండగా, విజయసాయిరెడ్డికి కూడా తెలియకుండా కేంద్రానికి రాష్ట్రం నుంచి ఫైల్స్ వెళ్తున్నాయంటూ మరికొందరు చెబుతున్నారు. ఇంతకీ విషయం తెలియని విజయసాయిరెడ్డి కేంద్రానికి వేసిన ప్రశ్నతో జగన్ ఇరకాటంలో పడ్డారన్న మాట మాత్రం నిజం.
అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం పై ఓ నిపుణుల కమిటీని వేసింది జగన్ ప్రభుత్వం. దీనిపై ఆ కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్టు కాబట్టి కాంపిటెంట్ అథారిటీ కేంద్రమే. అందువల్ల ఈ నిపుణుల కమిటీ కాపీ కేంద్రానికి వెళ్ళింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పరిణామాలు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి తెలియకుండా జరుగుతాయా? తెలిసీ వేశారంటే, మరి విజయసాయి అసలు టార్గెట్ ఏమిటి? పోలవరంపై కేంద్రానికి నాలుగు ప్రశ్నలు సంధించడంతో తాజా ఎపిసోడ్ కు విజయసాయి రెడ్డి తెరలేపారు. దానికి కేంద్రం సమాధానం ఇస్తూ, మొత్తం రూ. 2346.85 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించినట్లు ప్రకటించారు. అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోని అంశాలు మాత్రమే ఈ గణాంకాలను ఇప్పటి వరకు కేంద్రం ఆమోదించనూలేదు, తిరస్కరించనూలేదు.
కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన, ఏపీ నిపుణుల కమిటీ వివరాలను మాత్రమే సమాధానంగా మంత్రి తెలిపారు. ఇంతవరకూ అంతా సజావగా ఉన్నట్లు కన్పించినా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిపుణుల కమిటీ నివేదిక విజయసాయిరెడ్డి దగ్గర ఎందుకు లేదన్నది మరో కీలకమైన ప్రశ్న. చివరగా ఇచ్చిన కీలక సమాచారం నిపుణుల కమిటీ నివేదికపై కేంద్రం ఏం చర్యలు తీసుకుందని విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నకు కేంద్రం నుంచి దిమ్మతిరిగే సమాధానం వచ్చింది. స్వయంగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవంబర్ 13వ తేదీన అంటే మూడు వారాల క్రితం కేంద్రానికి రాసిన లేఖను కేంద్ర మంత్రి తన సమాధానంలో ప్రస్తావించారు. అన్ని చెల్లింపులు ప్రొసీజర్ ప్రకారమే జరిగాయని చెప్పారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం, ఎక్కడా అవినీతి చెయ్యలేదు అని జగన్ ప్రభుత్వం చెప్పింది. మరి ఈ లేఖను బయట పెట్టే ప్రశ్న, విజయసాయి రెడ్డి ఎందుకు వేసారు ? ఒక వేళ ఆయనకు తెలియకుండా ప్రశ్న వేసారు అంటే, రాష్ట్రం ప్రభుత్వంలో జరుగుతున్నవి ఏమి ఆయనకు చెప్పటం లేదా ? మొత్తానికి, రాజ్యసభలో విజయసాయి వేసిన ఈ ప్రశ్న, మరిన్ని ఎన్నో ప్రశ్నలకు దారి తీసింది.