చంద్రబాబు అధికారంలో ఉండగా, ప్రతి రెండు మూడు రోజులకు మీడియా ముందుకు వచ్చి, అక్కడ ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో జరిగిపోయింది, పోలవరం నిర్మాణంలో క్రాక్ లు వచ్చాయి, ఇలా అనేక ఆరోపణలు చేస్తూ, అప్పటి ప్రభుత్వానికి చిరాకు తెప్పిస్తూ ఉండేవారు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రం అసలు అడ్డ్రెస్ లేరు. కేవలం చంద్రబాబు అధికారంలో ఉంటే మాత్రమే, వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా ? జగన్ ప్రభుత్వం పై ఏమి విమర్శలు చెయ్యరా, ఇసుక కొరత, పేపర్ లీక్, వాలంటీర్లుగా వైసిపీ నేతలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు, పోలవరం ఆగిపోవటం, అమరావతి ఆగిపోవటం, ఇలా అనేక సమస్యల పై ఎందుకు ఉండవల్లి మాట్లాడటం లేదు అంటూ, విమర్శలు వస్తూ వచ్చాయి. విమర్శలు మరీ ఎక్కువ అయితే బాగోదు అనుకున్నారో ఏమో కాని, నాలుగు నెలల తరువాత, ఉండవల్లి మీడియా ముందుకు వచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ఆనం రోటరీ హాలులో మంగళవారం ఉండవల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ముందుగా జమ్ము కాశ్మీర్ అంశం పై మొదలు పెట్టారు. రెండు నెలలుగా అక్కడ కర్ఫ్యూ పెట్టి, గొప్పగా చెప్పుకుంటున్నారని, బీజేపీని విమర్శించారు. కాశ్మీర్ లో, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్తూ, మోడీ లాంటి మత పిచ్చి ఉన్న వాడిని, ట్రాంప్ జాతి పిత అనటం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఇక జగన్ పై మాట్లాడుతూ, ఈ నాలుగు నెలల్లో జగన్ పై చెప్పుకోవటానికి బీబత్సమైన చెడు లేదని, అలాని ఎదో పొడిచేసారు అని చెప్పుకునే పరిపాలన లేదని చెప్పారు. ఇసుకతో విపరీతమైన మైనస్ లో ఉన్నారని, కొత్త పాలసీతో ఈ సమస్యను అధిగామిస్తారాని అనుకుంటున్నా అని అన్నారు. ప్రత్యెక హోదా పై విలేఖరులు అడగగా, ఆయన ఇవ్వరు , మెజారిటీ ఉందని ఈయన చెప్పేసారుగా అని అన్నారు.
ఇక జగన్ కు వచ్చిన మెజారిటీ పై, తరువాత వచ్చే పరిణామాల పై సంచలన వ్యాఖ్యలు చేసారు ఉండవల్లి. జగన్ మోహన్ రెడ్డి గారు, మీకు అధికారం శాశ్వతం అనుకుని ఉండమాకండి, మీ ఎమ్మెల్యేలే మీ పై తిరగబడే అవకాసం ఉంది. మీ ఎమ్మెల్యేలను సంతృప్తిపరచండి. అందరూ ఆనందంగా ఉంటేనే, మీకు మంచిది అని ఉండవల్లి అన్నారు. చరిత్రలో 50 శాతం పైన ఓట్లు రెండు సార్లు వచ్చాయని, రెండు సార్లు వారు తొమ్మిది నెలలు తిరగకుండానే బోల్తా పడ్డారని అన్నారు. "1972లో పీవీ నరసింహారావు ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు 56 శాతం ఓట్లు, 219 సీట్లు వచ్చాయి. కానీ ఆయన్ను కేవలం 9 నెలల్లో దింపేశారు. 1994లో టీడీపీ, కమ్యూనిస్టులకు 54 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి 213 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు 34 సీట్లు వచ్చాయి. కాంగ్రె్‌సకు కేవలం 26 సీట్లే వచ్చాయి. కానీ 9 నెలల్లో ఎన్టీఆర్‌ను దింపేశారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరగబడతారని ఎవరైనా అనుకున్నారా?’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సీఎం జగన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు.