విశాఖ జిల్లాలో మంత్రి, వైసీపీ నేత, బహిరంగంగా స్టేజ్ పైనే వాదనలాడుకోవటంతో, అందరూ షాక్ అయ్యారు. ఈ రోజు సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వైజాగ్ లో కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో, పాల్గొన్న ఇద్దరు వైసిపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, స్టేజ్ పైనే తిట్టుకున్నారు. ఈ ఇరువురు నేతలు, సాక్షాత్తు మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నేత ద్రోణంరాజు. ముందుగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామస్థుల కష్టాలు ద్రోణంరాజుకు తెలియదని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించారు ద్రోణంరాజు. తనకు గ్రామీణ సమస్యల పై పూర్తి అవగాహన ఉందని, తనకు అన్ని కష్టాలు తెలుసు కాబట్టే, ఎమ్మెల్యేగా ఓడినా సరే, జగన్ తనకు నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించరని అన్నారు. అంతటితో ఆగకుండా, డైరెక్ట్ గా మంత్రి అవంతి శ్రీనివాస్ పై, స్టేజ్ పైనే విమర్శలు గుప్పించారు.
అవంతి శ్రీనివాస్ విశాఖపట్నం జిల్లాకు వలస వచ్చి , ఇక్కడ మంత్రి పదవి పొందారని ద్రోణంరాజు శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. మాట్లాడే ముందు చిన్నా పెద్దా చూసుకోవాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడ కూడదు అంటూ, మంత్రి అవంతికి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఓడినా తనకు సీఎం జగన్ నామినేటెడ్ పదవి ఇచ్చారంటే, తన పై ఎంత గౌరవం ఉందొ తెలుసుకోవాలని అన్నారు. ఈ జిల్లాకు వచ్చిన వలసదారులకు తన పదవి కావాలంటే ఇచ్చేస్తానంటూ, పరోక్షంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. దీంతో అవాక్కయిన అవంతి శ్రీనివాస్, తనకు వేరే ఉద్దేశం లేదని, మాములుగా ఆ వ్యాఖ్యలు చేసానని, మంత్రి అవంతి శ్రీనివాస్ సర్దిచెప్పే ప్రయత్నం చేసారు.
అయితే వైసీపీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల మధ్య మాటల యుద్ధంతో పార్టీలోని నాయకులు కాస్త అయోమయానికి గురయ్యారు. వైసీపీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల మధ్య మాటల యుద్ధంతో పార్టీలోని నాయకుల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ నాయకత్వం, ముందుగా నాయకత్వం మధ్య సమన్వయం కోసం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ నాయకత్వం నాయకుల మధ్య సమన్వయం కోసం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రతి విషయంలో వివాదాస్పదం అవ్వటం పై, అధినాయకత్వం ద్రుష్టి పెట్టాలని, మంత్రి దూకుడు తగ్గించాలని కోరుతున్నారు.