హుజూర్నగర్ ఏంటి జగన్ మోహన్ రెడ్డి ఏంటి అనుకుంటున్నారా ? తెలంగాణాలో గత 5 ఏళ్ళలో కనీసం పోటీ కూడా చెయ్యని వైసీపీ, ఒక ఉప ఎన్నిక కోసం, రంగంలోకి దిగటం ఏంటి అనే ఆలోచనా ? 2014లో వైసీపీ తరుపున గెలిచిన, ఎమ్మల్యే, ఎంపీ, టీఆర్ఎస్ లో చేరినా, జగన్ అసలు మాట్లాడ లేదు. కాని ఇక్కడ చంద్రబాబు చేస్తే మాత్రం, దేవుడి స్క్రిప్ట్ ఫిరాయింపులు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేసిఆర్ కు జగన్ కు మధ్య ఉన్న బాండింగ్ కు, ఉదాహరణ ఇది. అయితే ఇప్పుడు మరో 20 రోజుల్లో జరిగే హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం, కేసీఆర్ కు సహాయ పడటానికి, జగన్ రంగంలోకి దిగుతున్నారా, అంటే అవును అనే సమాచారం వస్తుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మికంగా తీసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చెయ్యటమే కారణం.
కాంగ్రెస్ గెలిచిన ఈ సీటులో, ఉప ఎన్నిక జరుగుతూ ఉండటం, ప్రాధాన ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ కుటుంబం పోటీ చెయ్యటంతో, వారిని అక్కడ ఓడించి, తమకు తిరుగు లేదు అని కేసీఆర్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అక్కడ, ఊరికి ఒక ఎమ్మెల్యేని, మండలానికి ఒక మినిస్టర్ ని పెట్టి, ఎలా అయిన ఆ సీట్ ను కైవసం చేసుకోవటానికి కేసీఆర్ ఎత్తుగడ వేసారు. అయితే, తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చెయ్యదు అని, ఈ సారి కూడా మహా కూటమిగా వస్తారని, అనుకున్న కేసిఆర్ కు షాక్ ఇస్తూ, తెలుగుదేశం పార్టీ అక్కడ కాండేట్ ని నిలబెట్టింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, అక్కడ 25 వేల ఓట్లు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో, టిడిపికి ఎంతో కొంత పట్టు ఉంది. టిడిపి పోటీ చేస్తే, అక్కడ చీలేది టీఆర్ఎస్ ఓట్లే.
అందుకే ఇప్పుడు టిడిపి గెలవకపోయినా, టిడిపి వల్ల నష్టం వస్తుందని, కేసిఆర్ గ్రహించి, వెంటనే సిపిఐ వద్దకు పొత్తు కోసం వెళ్లారు. అంతే కాకుండా ఇప్పుడు జగన్ సహాయం కూడా తీసుకోవాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తూ ఉండగా, టీఆరెస్ కూడా అదే సామాజికవర్గం నుంచి అభ్యర్థిని నిలబెడుతుంది. అయితే ఆ సామాజికవర్గం మద్దతు ఎక్కువగా ఉత్తమ్ భార్య పద్మావతికే ఉందనే రిపోర్ట్ రావటంతో, మిగతా సామాజికవర్గాల ఓట్లు తమకు పడినా రెడ్డి సామాజికవర్గ ఓట్లను ఎలాగైనా చీల్చాలని కేసీఆర్ వ్యూహం పన్ని, అందుకు అనుగుణంగానే అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిని నిలపాలని జగన్ను కోరినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి పడే రెడ్డి ఓట్లు, జగన్ చీలుస్తారని కేసిఆర్ గట్టిగా నమ్ముతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుంది ? జగన్ అక్కడ అభ్యర్ధిని నిలబెడతారా అనేది చూడాలి.