వైసిపీ అధ్యక్షుడి జగన్ మోహన్ రెడ్డి పై, అనేక కేసులు ఉన్న సంగతి తెలిసిందే. తన తండ్రి అధికారంలో ఉండగా, ఆదాయానికి మించిన ఆస్థులు వెనకేసారని, సిబిఐ అభియోగాలు మోపింది. తీవ్ర ఆర్ధక నేరాలు ఉండటంతో, ఈడీ కూడా కేసులు పెట్టింది. జగన్ మోహన్ రెడ్డి పై మొత్తం 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్నాయి. 2012 మే నెలలో జగన్ మోహన్ రెడ్డి ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. 16 నెలలు జైలు జీవితం కూడా అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అయితే, అప్పటి నుంచి విచారణ సాగుతూనే ఉంది. ఈ కేసుల విచారణలో భాగంగా, జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని నాంపల్లి కోర్ట్ కు రావాల్సి ఉంటుంది. అయితే జగన్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా శుక్రవారం కోర్ట్ కు వెళ్ళలేదు. ప్రతిసారి న్యాయమూర్తికి ముఖ్యమంత్రిగా విధులు ఉన్నాయని చెప్తూ, మినహయింపు పొందుతున్నారు.
అయితే ప్రతి సారి ఇది కుదరదు కాబట్టి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్ట్ లో, ఒక పిటీషన్ దాఖలు చేసారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ప్రతి శుక్రవారం కోర్ట్ కు రావాలంటే కుదరదు, తన తరుపున, న్యాయవాది జి.అశోక్ రెడ్డి హాజరుఅవుతారు, అనుమతి ఇవ్వండి అంటూ కోర్ట్ లో పిటీషన్ వేసారు. సీఆర్పీసీ సెక్షన్ 205 ని కోట్ చేస్తూ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో గురువారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రి అని, తనకు చాలా ప్రభుత్వ బాధ్యతలు ఉన్నాయని, అలాగే ప్రతి వారం అమరావతి నుంచి హైదరాబాద్ రావాలి అంటే, చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా బాగోలేదని, అందుకే తరుచు హైదరాబాద్ వచ్చి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి గండి కొట్టలేనని, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, మినహాయింపు ఇవ్వాలని కోరారు.
తన వ్యక్తిగత హాజరు ఎప్పుడు అవసరం అని కోర్ట్ అనుకుంటే, అప్పుడు వచ్చి హాజరు అవుతానని జగన్ కోర్ట్ కు చెప్పారు. ప్రతి వాయిదాకు నిందితుల హాజరు అవసరం లేదని, గతంలో, బసవరాజ్ ఆర్.పాటిల్, భాస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ పిటీషన్ పై ఈరోజు విచారించిన కోర్టు, తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది. అయితే ఈ వినతిని జగన్ గతంలో కూడా కోరారు. తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని, దాఖలు చేసుకున్న పిటిషన్‌ను 2014లో ఇదే కోర్టు తిరస్కరించగా హైకోర్టు సమర్థించింది. ఇక మరో పక్క, ఈ రోజు శుక్రవారం కావటంతో, జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు విచారణ జరిగింది. ఈ కేసులో విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మాత్రమే హాజరయ్యారు. ఇవాళ ఈ కేసులో 11చార్జిషీట్ల విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.