మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావటంతో, ఆ పార్టీ నుంచి కొంత మంది నేతలు, అధికార పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీలను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో, అతి పెద్ద ఆపరేషన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద పడ్డారు. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమదైన శైలిలో వ్యవహరించి, తమ వైపు లాక్కున్నారు. ఈ మేరకు పార్టీ వీడుతున్నట్టు, ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్ ప్రకటించారు. అంతే కాదు, రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాసి, తమను వేరే గ్రూప్ గా పరిగణించాలని కోరారు. మరో పక్క కాకినాడలో కొంత మంది నేతలు, రహస్య సమావేశం అవ్వటం కూడా సంచలనం సృష్టించింది. ఈ పరిణామాల అన్నిటి పై చంద్రబాబు స్పందించారు.
చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ నుంచి నేతలు పార్టీ మారుతున్న విషయం తెలుసుకున్న చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో ఫోన్‌లో మాట్లాడి, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సందేశం ఇచ్చారు. కష్ట కాలంలో తెలుగుదేశం కార్యకర్తలు అధైర్యపడొద్దని చంద్రబాబు అభయమిచ్చారు. నేతలు పార్టీని వీడటం, మన పార్టీ పై సంక్షోభం సృష్టించడం టీడీపీకి కొత్తకాదని చంద్రబాబు అన్నారు. స్వార్థ రాజకీయం కోసం , వారి భవిషత్తు కోసం నేతలు పార్టీ మారితే తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ తమ పోరు కొనసాగిస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు.