జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో, అందరినీ ఆకట్టుకున్న పధకం అమ్మఒడి. బడికి పంపించే పిల్లల తల్లులు అందరికీ 15 వేలు ఇస్తాం అంటూ చేసిన ప్రకటన, జనాల్లోకి బాగా వెళ్ళింది. కొంత మంది ఇది సాధ్యం కాదు అని చెప్పినా, ప్రజలు మాత్రం నమ్మారు, జగన్ ను గెలిపించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు గెలిచిన తరువాత, జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చెయ్యాలనుకున్న అమ్మ ఒడి పథకం పై నిన్న ప్రభుత్వం క్లారిటీ వచ్చింది. అమ్మఒడి పథకానికి సంబంధించిన కీలక అంశం పై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ప్రైవేటు స్కూల్స్ లో చదువుకునే వారు ఎవరు ఉన్నా, ఈ పధకం వారికి వర్తించదని చెప్పారు. ప్రభుత్వ బడులకు పంపించే పిల్లల, తల్లులుకు మాత్రమే ఈ పధకం కింద అర్హులని, వారికి మాత్రమే అమ్మఒడి పథకం కింద, జగన్ చెప్పినట్టు రూ.15వేల ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
అమ్మ ఒడి పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేస్తామంటూ జగన్ చెప్పిన వెంటనే, అందరూ సంతోష పడ్డారు. తల్లులు అందరికీ 15 వేలు వస్తాయని సంబర పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం, క్లారిటీ ఇవ్వటంతో, ప్రైవేటు స్కూల్స్ లో చదువుతున్న పిల్లల తల్లులు అవాక్కయ్యారు. ప్రైవేటు స్కూల్స్ లో అందరూ గొప్ప వారే ఉండరని, ఎన్నో చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ లో పేదలు తమ పిల్లలను పంపిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. పాదయాత్రలో అన్ని స్కూల్స్ కు ఇస్తాం అని చెప్పి, ఇప్పుడు కేవలం ప్రభుత్వ స్కూల్స్ కు మాత్రమే ఇవ్వటం దారుణం అని అన్నారు. ఇదే ప్రాతిపదికిన, కాలేజీల్లో చదివే విద్యార్ధులకు ఎందుకు ఫీజ్ చెల్లిస్తున్నారని, ప్రైవేటు కాలేజీలకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారని, దానికి, దీనికి తేడా ఏంటి అంటూ నిలదీస్తున్నారు. మాట తప్పను, మడం తిప్పను అంటే ఇదేనా అని అడుగుతున్నారు. చూద్దాం, ప్రభుత్వం ఏమి చెప్తుందో...