తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ప్రంట్‌పై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని సీఎం చంద్రబాబు అన్నారు. 21 పార్టీల నేతలతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్రంట్ పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్లు ఎవరినైనా తాము స్వాగతిస్తామని చంద్రబాబు తెలిపారు. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై స్పందిస్తానని చంద్రబాబు చెప్పారు. ఈ ఫ్రంట్‌కు మద్దతు కోరుతూ సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురు నేతలను కలిశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, కేరళ సీఎం పినరయిని ఇప్పటికే ఒకసారి కలిశారు.
రెండో సారి కూడా ఈ నేతలను కలవటానికి కేసీఆర్ బయలుదేరారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ను సీఎం కేసీఆర్ త్వరలో కలిసి మద్దతు కోరతారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్‌పై కసరత్తులు ప్రారంభించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలుండటంతో మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. ఇది ఇలా ఉంటే, 21 పార్టీల నేతలతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన చంద్రబాబు, ఓట్ల లెక్కింపు సమంలో ఈవీఎంలతో సమాంతరంగా వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు.
ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులు సరిపోవాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించాలన్నారు. అభ్యర్థులు కోరినచోట మళ్లీ లెక్కించాలని కోరారు. పారదర్శకత ఉంటే వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల వివరాలు వెబ్సైట్లో ఉంచితే ప్రజలంతా చూసుకుంటారని చెప్పారు. ఎన్నికల విధానంపై ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలని సూచించారు. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడం కష్టమైన పని కాదని, తాము పోరాటం చేసేది తమ కోసమో, పార్టీ కోసమో కాదన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కల్గించేందుకే పోరాడుతున్నట్టు స్పష్టంచేశారు. ఓట్ల లెక్కింపు ఆలస్యమైనా ఇబ్బంది లేదని సీఎం వ్యాఖ్యానించారు.