స్టేషన్ బెయిల్ ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు కొత్తపల్లి పోలీసుస్టేషన్‌పై రాళ్ళు, కొబ్బరి బొండాలతో దాడి చేశారు. ఈ దాడిలో కాకినాడ త్రీటౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణమూర్తికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ అభ్యర్థి ఎస్వీఎన్‌ఎన్ వర్మ పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఉప్పాడ కొత్తపల్లి జడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలపడం, అనంతరం వర్మ వాహనం అద్దాలు పగుల గొట్టడం, గన్‌మెన్‌ను గాయపరిచడం జరిగింది. దీంతో వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొత్తపల్లి పోలీసులు.. వర్మపై దాడి చేసిన తిక్కాడ యోహానును, ఓసిపల్లి కృపను మంగళవారం అరెస్ట్‌చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తులపై ఉప్పాడ ఎంపీటీసీలు ఉమ్మిడిజాన్, తోటకూర మారెమ్మ, వైసీపీ నాయకుడు ఆనాల సుదర్శన్ పోలీసుస్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అన్యాయంగా అరెస్ట్‌చేసిన తమ కార్యకర్తలను కోర్టుకు తరలించకుండా స్టేషన్‌బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టేషన్ బయట రాస్తారోకో చేపట్టారు. ఆ సమయంలో నిందితులను పోలీసులు కోర్టుకు తరలించేయత్నం చేయడాన్ని వైసీసీ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెచ్చిపోయిన మత్స్యకారులు, వైసీపీ కార్యకర్తలు కొబ్బరి బొండాలు, రాళ్ళతో పోలీసుస్టేషన్, కానిస్టేబుళ్లపై దాడిచేశారు.
దీంతో పోలీసులు ఎదురుదాడి చేశారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీలు రవివర్మ, తిలక్ పరిశీలించారు. ఆందోళన కారులను చెదరకొట్టడంతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఈ దాడిలో కాకినాడ త్రీటౌన్ కానిస్టేబుల్ సత్యనారాయణమూర్తికి తలకు తీవ్రగాయమైంది. ఇద్దరు మత్స్యకారుల మహిళలు స్పృహ కోల్పోయారు. దీంతో వారిని అంబులెన్స్‌లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఎమ్మెల్యే వర్మపై దాడిచేసిన ఇద్దర్ని పిఠాపురం కోర్టుకు తరలించారు. ఉప్పాడలో శాంతి భద్రతలకు నష్టం వాటిల్లకుండా 10 పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేసినట్టు కాకినాడ డీఎస్పీ రవివర్మ చెప్పారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయ న విజ్ఞప్తి చేశారు. పోలీసులపై దాడిచేసిన నలుగురిని అదు పులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఆయన చెప్పారు.