కిడ్నీల కోసం అవయవదానం నాటకమాడిన నెల్లూరు సింహపురి ఆస్పత్రి వివాదం సచివాలయంలో ఉన్నతస్థాయిలో రచ్చకు దారి తీసింది. నిరుపేద రోగికి ఖరీదైన చికిత్స చేసి... బిల్లు కట్టాల్సిందే అని బెదిరించి... చివరికి బలవంతంగా కిడ్నీ దానం చేయించిన వైనం కలకలం సృష్టించింది. దీని పై ఆ జిల్లా కలెక్టరు విచారణ జరిపి, ఏప్రిల్ 29వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఏప్రిల్ 30న ఆ ఆస్పత్రిపై చర్యలకు ఆదేశాలిచ్చారు. అదే రోజు ఉదయం పూనం మాలకొండయ్య సీఎ్‌సను మర్యాదపూర్వకంగా కలిసి.. సింహపురి ఘటన వివరించి, తాము తీసుకున్న చర్యలను వివరించారు.
ఆ సమయంలో మరికొందరు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. సింహపురి ఆస్పత్రి మోసానికి పాల్పడిందని, చట్టాలు, జీవోలు ఉల్లంఘించిందని పూనం చెబుతుండగా.... అవన్నీ మీకెలా తెలుసని సీఎస్ ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. కలెక్టర్ నివేదిక ఆధారంగా మాట్లాడుతున్నానని బదులివ్వగా... ‘కలెక్టర్‌కు ఏం తెలుసని ఆ నివేదిక ఇచ్చారు!’ అంటూ దానిని పక్కన పెట్టాలనే అర్థం వచ్చేలా సీఎస్ మాట్లాడినట్లు సమాచారం. అయితే, విచారణ కమిటీలో డీఎం అండ్ హెచ్‌వో కూడా ఉన్నారని చెప్పగా... డీఎంఅండ్‌హెచ్‌ఓకు మాత్రం ఏం తెలుసని సీఎస్ తీసిపారేసినట్లు తెలిసింది. ‘‘సింహపురి ఆస్పత్రి వాళ్లు నిన్న నన్ను కలిశారు.. ఈ ఘటనపై నేను వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)తో విచారణ జరిపించాలనుకుంటున్నాను. తక్షణమే డీఎంఈని నెల్లూరు పంపి విచారణ జరిపించండి’’ అని సీఎస్ ఆదేశించారు.
ఈ ప్రతిపాదనతో పూనం విభేదించారు. ఈ వివాదంపై ఆస్పత్రుల రిజిస్ర్టేషన్‌తో ఏ మాత్రం సంబంధంలేని డీఎంఈ విచారణ చేయడం తగదని, ఒకవేళ డీఎంఈ నివేదిక ఇచ్చినా చట్టపరంగా అది చెల్లుబాటు కాదని ఆమె వివరించే ప్రయత్నం చేశారు. సీఎస్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని, సింహపురిపై చర్యలు తీసుకునేందుకు తొందరపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తానేమీ తొందరపడడం లేదని.. కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నానని పూనం సమాధానం చెప్పారు. ‘‘ఈ ఘటనలో బాధిత మహిళ ఒక నిరుపేద గిరిజనురాలు. యానాది సామాజిక వర్గానికి చెందిన మహిళ. కనీసం రేషన్ కార్డు కూడాలేదు. ఒక బ్యూరోక్రాట్‌గా ఆమెకు అండగా నిలవాలనుకుంటున్నాం’’ అని పూనం చెప్పినట్లు తెలిసింది. మరి నా ఆదేశాలు ఏం చేస్తారని సీఎస్ ప్రశ్నించినట్లు తెలిసింది. ‘మీ ఆదేశాలు రాతపూర్వకంగా నాకు వస్తే... దానిపై తీసుకున్న చర్యలను మీకు తెలియజేస్తాను’ అని పూనం బదులిచినట్లు సమాచారం. మొత్తానికి ఈ వివాదంపై ఇద్దరు అధికారుల మధ్య 15 నిమిషాలపాటు తీవ్ర వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కలెక్టర్ ఇచ్చిన నివేదికను సీఎస్ తీసిపారేసేలా మాట్లాడడంపై ఐఏఎస్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.