రాష్ట్రంలో మార్చ్ 10వ తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అమాల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, వైసీపీ, వివధ సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేస్తూ వచ్చాయి. వైసీపీ ఫిర్యాదు చేస్తే మాత్రం, గంటల్లోనే ఈసీ స్పందించిన తీరు, ఏకంగా చీఫ్ సెక్రటరీని మార్చేసిన తీరు చూసాం. అయితే తెలుగుదేశం ఫిర్యాదుల పై మాత్రం, ఒక్కటంటే ఒక్కటి కూడా ఈసీ పరిగణలోకి తీసుకులేదు. చరిత్రలో లేని విధంగా, ఒక ముఖ్యమంత్రి ఈసీ దగ్గరకు వెళ్లి చెప్పినా, స్వయానా లెటర్ లు రాసినా, ప్రజలకు ఇబ్బంది అవుతుంది కోడ్ సడలించమని చెప్పినా, ఎలక్షన్ కమిషన్ కనీసం పట్టించులేదు. అయితే, తెలుగుదేశం ఎన్ని ఫిర్యాదులు, ఎలక్షన్ కమిషన్ కు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబు చెప్పిన సంగతి.
నిన్న చంద్రబాబు మాట్లాడుతూ, తాము 110 ఫిర్యాదులు చేస్తే ఒక్కదానిపైనా స్పందించలేదని విమర్శించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు చేస్తున్నారని... ఏపీలో మాత్రం చేయడానికి వీల్లేదంటున్నారని తెలిపారు. తాను ప్రధాని రేసులో లేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని పదవికి రాహుల్కంటే చంద్రబాబము బెటర్ అని ఇటీవల శరద్ పవార్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించినప్పుడు ఆయన ఈ మాట అన్నారు. ఈ విషయంలో తాను మొదటి నుంచి ఒకటే వైఖరితో ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల తర్వాత అందరం కలిసి కూర్చుని ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల కోసం పని చేసేందుకు కూడా ముఖ్యమంత్రులు ఎన్నికల కమిషన్ను అడుక్కోవాలా అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో సమీక్షలకు అవకాశమివ్వాలని ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ ఢిల్లీకి వెళ్లి, ఈసీని కోరాల్సి వచ్చిందని తెలిపారు.
మోదీ దేశాన్ని బాగు చేయడంకంటే... చెడగొట్టిందే ఎక్కువని చంద్రబాబు విమర్శించారు. ‘యూపీ ఎన్నికల కోసం పెద్ద నోట్లను రద్దు చేశారు. రూ.వెయ్యి నోటు రద్దు చేసి కొత్తగా రూ. రెండు వేల నోటు తెచ్చారు. వద్దన్నా వినలేదు. దీనివల్ల ఎన్నికల్లో విపరీతమైన వ్యయం పెరిగింది’’ అని తెలిపారు. ఈ దేశంలో మోదీకి ఒక రాజ్యాంగం... ఇతరులకు మరో రాజ్యాంగం అమలవుతున్నట్లుగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీయేతర రాష్ట్రాలకు మాత్రం అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ప్రధాని ఏం మాట్లాడినా దానికి ఎన్నికల కోడ్ వర్తించదు. మేం మాట్లాడటానికి మాత్రం కోడ్ అడ్డం వస్తుంది. తుఫాన్లు వస్తే అధికారులకు ఆయన ఆదేశాలు ఇస్తారు. మేం మాత్రం కనీసం సమీక్షలు కూడా చేయకూడదు. ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా ఈసీ పట్టించుకోదు. బెంగాల్లో నలభై మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపుల్లో ఉన్నామని బహిరంగంగా చెప్పినా ఈసీ స్పందించలేదు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.