వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించిన ఆడియో టేప్స్ శనివారం నాడు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఆడియో టేపులను ప్రసారం చేసింది. అయితే ఆ వాయిస్ తనది కాదని.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన హడావుడి చేశారు. అయితే ఈ సంచలన ఆడియో విషయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్పింది ముమ్మాటికి నిజమైంది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ ముమ్మాటికి విజయసాయిరెడ్డిదేనని ప్రముఖ ఫోరెన్సిక్ సంస్థతో సాంకేతికంగా ఏబీఎన్ నిర్థారించింది. ఆ ఆడియోలో ఆంధ్ర ప్రజలకు నిబద్ధత లేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఆడియో బయటకు రావడంతో ఆయన మాట మార్చారు.
ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని తెలిపారు. అయితే ఫోన్ ఆడియోలో ఉన్న వాయిస్ విజయసాయిరెడ్డిదేనని స్పష్టమైంది. దీంతో ఆడియో తనదేనని నిరూపించాలంటూ విజయసాయి ఎదురు సవాళ్లు సైతం విసిరిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ‘జాగ్రత్త’లు చెబుతూ... ఆయన ఒక ఆడియో సందేశం పంపించారు. తన సహజ శైలిలో ‘వాడు, వీడు’ అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రధాని కార్యాలయంలో ప్రత్యక్షమవుతూ, కుదిరినప్పుడల్లా ప్రధాని కంట్లో పడటానికి ప్రయత్నించిన ఆయన... ఇప్పుడు చిత్రంగా మోదీపైనా విమర్శలు గుప్పించారు. ఇక... వైసీపీలో కొత్తగా చేరిన కుర్రాళ్లకు ‘ఐక్యూ’ లేదని, గత ఎన్నికల్లో జగన్ బంధువులు తప్పుడు సర్వేలు చేసి ఆయనలో భ్రమలు సృష్టించారని వాపోయారు. ‘ఇప్పుడైనా జాగ్రత్త పడదాం’ అని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. సుమారు 12 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో క్లిప్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
విజయసాయి రెడ్డి ఆడియోను శనివారం మధ్యాహ్నం ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ప్రసారం చేసింది. అయితే, అది తన గొంతు కాదని విజయసాయి రెడ్డి జగన్ చానల్లో చెప్పారు. దీంతో సదరు ప్రసారాన్ని ‘ఏబీఎన్’ నిలిపివేసింది. వెబ్సైట్లోనూ ఆ వార్తను తొలగించింది. ఆ స్వరం విజయసాయి రెడ్డిదేనా, కాదో శాస్త్రీయంగా ధ్రువీకరించుకోవాలని నిర్ణయించుకుంది. జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన, క్లిష్టమైన కేసుల్లో అనేక రాష్ట్రాల పోలీసులకు కూడా సేవలు అందించిన ప్రఖ్యాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సంప్రదించింది. ఆ సంస్థ నిపుణులు తాజా ఆడియో టేప్‌ను విజయసాయి రెడ్డి గతంలో చేసిన ప్రసంగాల్లోని స్వరాలతో సుమారు మూడు గంటలపాటు పోల్చి చూశారు. చివరికి... అది విజయసాయి స్వరమే అని ధ్రువీకరించారు.