సెంటిమెంట్... ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినిపిస్తోన్న మాట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో చర్చకు వస్తున్న అంశం. ఎన్నికల ప్రచారం అంతా సెంటిమెంట్ చుట్టూరానే తిరుగుతోంది. అయితే.. సెంటిమెంట్ రెండు రకాలుగా ఉంటుందని ఆంధ్రా ప్రజలు ఐదేళ్ల క్రితమే నిరూపించారు. ఒకటి బాహాటంగా ప్రదర్శించే సెంటిమెంట్ అయితే.. రెండోది నిద్రాణంగా ఉంటుంది. ఏమాత్రం అనుమానించే పరిస్థితి ఉండదు. కానీ.. అత్యంత వ్యూహాత్మకంగా ఉంటుంది. ఏ అంశమైనా ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరి ఆలోచన ఎలా ఉంది ? దానిపై ఎవరు ఏం చేస్తారు ? అసలు మనకు ఏం కావాలి ? అన్న విషయాలపై పూర్తి క్లారిటీ ఉంటుంది. ప్రధానంగా ఎవరు చేస్తారు? ఏం చేస్తారు? మనకేం కావాలన్న మూడు అంశాలు అందరికీ తెలుసు. ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో కూడా వాళ్లకు స్పష్టత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల నైజం ఇదే. ఇప్పుడు కూడా ఏ పార్టీ ప్రచారంలో ఏం చెబుతున్నా.. ఏపీకి అసలు ఏం జరుగుతోంది? ఏపీకి వ్యతిరేకంగా వ్యవహరించేవాళ్లెవరు ? ఎవరివైపున నిలబడితే.. ఎలాంటి ఫలితాలుంటాయి ? అన్నది ఆల్రెడీ ఓటర్లలోకి వెళ్లిపోయింది. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల ఫలితాలను ఈ అంశాలు నిర్దేశించనున్నాయి.
వాస్తవానికి ఢిల్లీలో తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించిన సమయంలో ఆంధ్రా ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. అప్పటికప్పుడు నిరసనలు చేపట్టారు. కానీ.. సాయంత్రానికి శాంతించి తగ్గుముఖం పట్టారు. సైలెంట్ అయిపోయారు. ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతిస్పందన ఇంతేలే అన్న ప్రచారం సాగింది. అప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తంచేసి.. తర్వాత మర్చిపోతారని భావించారు. కానీ.. ఆ ఆగ్రహమంతా నిగూఢంగా దాచుకున్నారు ఏపీ జనం. సమయం కోసం ఎదురుచూశారు. సమయం చూసి రాష్ట్రాన్ని విభజించిన ఏపీని అనాథను చేసిన కాంగ్రెస్‌పార్టీపై చావుదెబ్బ కొట్టారు. మళ్లీ ఇప్పట్లో కోలుకోలేని విధంగా ఆ పార్టీకి తమదైన రుచి చూపించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నిద్రాణంగా దాగుండే సెంటిమెంట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా బాహాటమవుతుందన్న సత్యం నిరూపితమైంది. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. అప్పటికే ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నీరసపడిపోయిన ఆ పార్టీకి ఒక్కసారిగా మూడంకెల సీట్లు వచ్చాయి.
పైగా.. అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. 150కి పైగా స్థానాల్లో మాత్రమే పోటీ చేసినా.. 103 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. ఒక్కసారిగా ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సెంటిమెంట్ ఓటర్లలో బలంగా నాటుకొని పోవడమే ఈ విజయానికి నిదర్శనమన్న విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి. ఈ స్థాయిలో ఓ అధికార పార్టీని చావుదెబ్బ తీసిన ఏపీ ఓటర్ల శైలి అందరికీ తెలిసొచ్చింది. ఇప్పుడు కూడా ఏపీలో దాదాపు అదే పరిస్థితి నెలకొంది. కాకపోతే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా.. అప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు మాత్రం.. బీజేపీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తుండగా.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు కూడా కేంద్రం ఏపీకి ఏం చేసిందన్న స్పష్టత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఇకపై ఏం చేయగలుగుతుందన్నదానిపైనా ఓ అంచనా ఉంది. పైగా.. ఏపీకి కావాల్సిన ప్రత్యేక తరగతి హోదా గురించి కూడా అందరికీ అవగాహన ఉంది. దీంతో.. ఇప్పుడు కూడా ఏపీ ప్రజలకు సేమ్ సిట్యుయేషన్ ఎదురయ్యింది. ఎన్నికల్లో ఈవీఎం మీట ఎటువైపు నొక్కాలో కూడా ఓటర్లకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో.. ఎన్నికల ఫలితాలు ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను ప్రస్ఫుటించబోతున్నాయంటున్నారు విశ్లేషకులు.