బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి ఆ పార్టీ నాయకత్వం ఊహించని షాక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించడం లేదనీ... ఎక్కడా ఆయన పోటీ చేయవద్దనీ ఆదేశించింది. ఈ మేరకు ఆయన తన నియోజకవర్గం కాన్పూర్ ప్రజలకు రాసిన లేఖలో స్వయంగా వెల్లడించారు. ‘‘ప్రియమైన కాన్పూర్ ఓటరులారా... నేను కాన్పూర్ సహా మరెక్కడా ఎన్నికల్లో పోటీ చేయరాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంలాల్ తెలియజేశారు. ..’’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం కోసం బీజేపీ ఇవాళ విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కూడా ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలకు స్థానం లభించలేదు.
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి, ఎల్కే ఆడ్వాణీలతో పాటు బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో జోషి కూడా ఒకరు. ఎల్కే ఆడ్వాణీకి కూడా బీజేపీ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆయన నియోజవర్గం గాంధీనగర్ టికెట్‌ను బీజేపీ చీఫ్ అమిత్ షాకి కేటాయించారు. ఎల్కే అడ్వాణీ 1991 నుంచి ఆరు సార్లు గాంధీ నగర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించారు. 1996లో వాజ్‌పేయి కూడా గాంధీ నగర్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. 85 ఏళ్ల మురళీ మనోహర్ జోషి... 2014లో ప్రధాని నరేంద్ర మోదీ కోసం వారణాసి స్థానాన్ని త్యాగం చేశారు. కాన్పూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తీరా ఇప్పుడు కాన్పూర్ నుంచి కూడా పార్టీ నాయకత్వం ఆయనను తప్పించింది.
ఇప్పటికే గాంధీనగర్ నుంచి తప్పించినందుకు గానూ భాజపా సీనియర్ నేత లాల్‌కృష్ణ అడ్వాణీ అసంతృప్తి వ్యక్తం చేసిన తెలిసిందే. అలాగే తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు మురళీ మనోహర్ జోషి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఒకవేళ తన పోటీ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అది స్వయంగా పార్టీ అధ్యక్షుడు తనకు తెలియజేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ప్రధాని మోదీ కోసం వారణాసి నుంచి తప్పుకున్నారు. కాన్పూర్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.