రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కోసం ఎన్నికల సంఘానికి వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం వైకాపా సానుభూతిపరులు పెట్టినవేనని సిట్ దర్యాప్తులో తేలింది. ఓట్లను తొలగించాలని కోరుతూ ఇతరుల పేరిట, వారి పేరిట దురుద్దేశపూరితంగా దరఖాస్తు చేసిన ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ స్థానిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీటిపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి..దరఖాస్తుదారులెవరో తేల్చారు. మొత్తం 376 కేసుల్లో 2,288 మందిని గుర్తించగా..వారిలో 80 శాతం మంది వైకాపా సానుభూతిపరులు, కార్య కర్తలు కాగా, 20 శాతం మంది తెదేపా సానుభూతిపరులు, ఇతరులు ఉన్నారని వెల్లడైంది.
ఫారం-7లపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన పోలీసు అధికారులకు 85 శాతం మంది దరఖాస్తుదారులు దురుద్దేశ పూరితంగానే పెట్టారని తేల్చారు. వీరిలో కొంతమంది మంచం నుంచి కదలలేని వ్యక్తులు, మృతులు, అసలు ఉనికిలో లేని వారి పేర్లతో..ఓట్లు తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ఎప్పటినుంచో ఒకే చిరునామాలో నివసిస్తున్న వ్యక్తుల పేర్లను తొలగించాలని ఎక్కువ దరఖాస్తులు పెట్టినట్లు తేల్చారు. మోసపూరితంగా దరఖాస్తులు పెట్టిన వారిని స్థానిక పోలీసుస్టేషన్లకు పిలిచి విచారిస్తున్నారు. ఆ దరఖాస్తులు వారే పెట్టారా? లేదా వారి పేరిట ఇతరులు ఎవరైనా పెట్టారా? వారే పెడితే.. ఎందుకు తప్పుడు సమాచారంతో పెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? తదితర అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారిచ్చే వివరణ ఆధారంగా సిట్ తదుపరి చర్యలు చేపట్టనుంది.
ఓట్ల తొలగింపు కోసం జనవరి 11 తర్వాత ఎన్నికల సంఘానికి 12.50 లక్షల ఫారం-7 దరఖాస్తులు అందాయి. వీటిలో దాదాపు 9.50 లక్షల దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలో.. కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే అందాయి. తొలుత ఎన్నికల సంఘం బూత్‌స్థాయి అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించగా...ఎక్కువ శాతం మంది అర్హుల ఓట్లను తొలగించాలని దరఖాస్తులు పెట్టినట్లు తేలింది. మొత్తం పరిశీలన తర్వాత కేవలం 1,41,823 మంది ఓటర్లనే జాబితాలో నుంచి తొలగించేందుకు అర్హమైనవిగా గుర్తించి ఆమేరకు తొలగించారు. మిగతా దరఖాస్తులన్నీ నకిలీవేనని తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అర్హుల ఓట్ల తొలగింపునకు కుట్ర జరిగినట్లు సిట్ అనుమానిస్తోంది. క్షేత్ర పరిశీలనలో కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పరిశీలించినప్పుడు ఆ దిశగా వారికి కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ప్రతిచోటా వేల సంఖ్యల్లో ఓట్లు తొలగించాలని దరఖాస్తులు అందగా...అందులో 95 శాతానికి పైగా అర్హుల పేర్లే ఉన్నాయి. అర్హుల పేర్లను జాబితా నుంచి గల్లంతు చేయించాలనే దురుద్దేశంతోనే ఇలా దరఖాస్తులు పెట్టినట్లు భావిస్తున్నారు.