‘ఆంధ్రా ద్వేషులతో జగన్ చేతులు కలిపారు. జగన్ సీఎం అయితే... వాన్‌పిక్ భూములను సొంతం చేసుకుని, పోర్టు పెట్టాలన్నది కేసీఆర్ వ్యూహం! జగన్‌ను గెలిపిస్తే మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టినట్లే!’.. ఇది ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పదేపదే చేస్తున్న విమర్శ! దీనిపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న జగన్.. ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబు ఆరోపణలు నిజమేనని పరోక్షంగా ధ్రువీకరించారు. అయితే, కేసీఆర్ మద్దతు తమకు కాదని.. ప్రత్యేక హోదాకు అని సూత్రీకరించారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు. కేసీఆర్‌తో వైసీపీకి సంబంధాలున్నాయని టీడీపీ, జనసేన చేస్తున్న విమర్శలతో మైన్‌సలో పడ్డామని.. ఇప్పుడు తమ పార్టీ అధినేతే వాటిని ధ్రువీకరించేలా మాట్లాడారని వాపోతున్నారు.
‘జగన్ చెప్పినట్లుగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎప్పుడు పెట్టారు? ప్రత్యేక హోదాకోసం మద్దతు ఎప్పుడు ప్రకటించారు? తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు హోదా కోసం ఎలా కలిసి వస్తారు?’ ఈ విషయాలు అర్థంకాక వైసీపీ నేతలు కూడా బుర్రగోక్కుంటున్నారు. నిజానికి.. పార్లమెంటులో హోదా ప్రస్తావన వచ్చినప్పుడు, ‘ఏపీకి మాత్రమే ఇస్తే మాకు నష్టం జరుగుతుంది. మాకు కూడా హోదా ఇవ్వాలి’ అని తెలంగాణ ఎంపీలు తేల్చిచెప్పారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన సోనియా గాంధీ ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం’ అని ప్రకటించడంపై కేసీఆర్ మండిపడ్డారు. ‘ఏపీకి హోదా ఇస్తామని మా గడ్డపై నుంచి చెబుతారా?’ అని ధ్వజమెత్తారు.
ఇదీ అసలు విషయం! మరి.. ప్రత్యేక హోదాకు కేసీఆర్ ఎప్పుడు మద్దతు పలికారు? ఆ సంగతి జగన్‌కు మాత్రమే చెప్పారా? ఈ విషయాన్ని జగనే స్పష్టం చేయాలి. ఇటీవల హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్ నివాసంలో జగన్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ఏపీకి ప్రత్యేక హోదాపై మద్దతు ఇస్తున్నారా?’ అని ప్రశ్నించినప్పుడు.. ఈ అంశంపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ తన సమాధానం దాటవేశారు. ఇప్పుడు కేసీఆర్ మద్దతుపై స్పందించి జగన్ మరో సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.