ఏపీలో ఎన్నికల ప్రచారం రోజురోజుకీ జోరందుకుంటోంది. ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు పార్టీలు, అభ్యర్ధులు వినూత్న రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే "నిన్ను నమ్మం బాబు" పేరుతో ఉధృతంగా ప్రచారం సాగిస్తున్న వైసీపీ.. తాజాగా మరో కొత్త తరహా ప్రచారానికి తెరదీసింది. ఎవరైనా నేను గెలవాలి అంటూ ప్రచారం చేస్తారు, నేనే పలానా పని చేస్తాను అంటూ ప్రజల మనసులు గెలుస్తారు. కాని, జగన్ మాత్రం, అదేదో సినిమాలో చూసినట్టు, చంద్రబాబుకు వోట్ వెయ్యద్దు, నాకు వెయ్యకపోయినా పరవాలేదు, చంద్రబాబుకు మాత్రం ఓటు వెయ్యద్దు అంటూ ప్రచారం చేస్తూ, తన పైత్యాన్ని తీర్చుకుంటున్నారు. ఈ పైత్యంలో భాగంగానే, మరో వినూత్న ప్రచారం మొదలు పెట్టూర్.
చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లుగా సూచిస్తూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కౌంట్ డౌన్ క్లాక్ లను ఏర్పాటు చేస్తోంది. ఏపీలో అధికార టీడీపీని ఎలాగైనా గద్దె దింపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష వైసీపీ... మరో కొత్త తరహా ప్రచారానికి తెరదీసింది. “బైబై బాబు- రావాలి జగన్- కావాలి జగన్” పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లుగా సూచించేలా డిజిటల్ క్లాక్స్ ను ఏర్పాటు చేస్తోంది. వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ టీమ్ సూచన మేరకు వైసీపీ తాజాగా ఈ డిజిటల్ కౌంట్ డౌన్ క్లాక్స్ ఐడియాకు రూపకల్పన చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఇలాంటి కౌంట్ డౌన్ క్లాక్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంతో పాటు విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ఈ డిజిటల్ క్లాక్స్ ను ఏర్పాటు చేశారు. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ కార్యాలయాల్లోనూ ఈ తరహా కౌంట్ డౌన్ క్లాక్స్ ను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా పార్టీ క్యాడర్ తో పాటు ఓటర్లలోనూ జోష్ నింపాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడే కొద్దీ ఇదే తరహాలో మరిన్ని ప్రచార వ్యూహాలు అమలు చేసేందుకు ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. బైబై బాబు పేరుతో డిజిటల్ క్లాక్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో వైసీపీ పట్ల పాజిటివ్ సంకేతాలు వెళతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అందుకే సాధ్యమైనంత త్వరగా అన్ని పార్టీ కార్యాలయాల్లోనూ కౌంట్ డౌన్ క్లాక్స్ ఏర్పాటుకు పార్టీ ఆదేశాలు ఇచ్చింది. ఈ రకమైన నెగటివ్ ప్రచారంతో, ఏమి సాధిస్తారో, ప్రశాంత్ కిషోర్, జగన్ కే తెలియాలి...