పోలీసులుగా చట్ట పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, దానికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారు ఏ పార్టీ వారైనా తమకు ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని జిల్లా పోలీసులు పనిచేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు బదులిచ్చారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న విషయంపై ఫిర్యాదు చేస్తే నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ నెల 28వతేదీ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నామని, సదరు సమావేశంలో ఎవరైనా తమ వద్ద ఉన్న నిర్దుష్ట సమాచారాన్ని పోలీసులకు తెలియజేయవచ్చన్నారు. పోలీసులు తనను లక్ష్యంగా ఎంచుకున్నారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారన్న విలేకరుల ప్రశ్నకు- ‘వాళ్లు రాజకీయ నాయకులు, ఏమైనా మాట్లాడుతారు. మేం ఇక్కడ కూర్చొని ఏమీ మాట్లాడలేం.. యూనిఫాం లేకపోతే మేమూ వంద మాట్లాడగలం’ అని బదులిచ్చారు. చీరాలలో పాత కేసులను తిరగదోడి అరెస్టులకు దిగుతున్నామనేది అవాస్తవమని, దర్యాప్తు పెండింగ్లో ఉన్న కేసుల్లో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఎన్నికల నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాంటూ జిల్లా ఎస్పీతో పాటు పలువురిపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన అంశంపై స్పందిస్తూ... ఆ విషయం తన దృష్టికి రాలేదని, అందులో ఏవైనా అభ్యంతరకర అంశాలుంటే న్యాయపరంగా వెళ్తామని బదులిచ్చారు. ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా ఉంటుందని, అసాంఘిక శక్తులను సహించేది లేదని ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో రాజకీయ వేడి ఎక్కువగా ఉంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు మీద గతంలో పలు కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ నేతలు డీజీపీ ఠాకూర్, ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ మీద ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.