ఎన్నికల షెడ్యూలు రాగానే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను పక్కకు తప్పిస్తారంటూ ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. వైసీపీ వర్గాలు వాట్సాప్ లో దీనిపై హల్చల్ సృష్టిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అదే సమయంలో... జగన్‌కు అనుకూలంగా ఉన్నట్లు టీడీపీ ఆరోపిస్తున్న కేసీఆర్ పత్రికలో ‘డీజీపీ మార్పు’పై గురువారం ఒక వార్త ప్రత్యక్షమైంది. డీజీపీ ఠాకూర్‌పై వైసీపీ అధినేత తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను మార్చేయాలని ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. పోలీస్ బాస్‌లు, కీలక స్థానాల్లో ఉన్న అధికారులపై ఎన్నికల సమయంలో విపక్షాలు ఫిర్యాదు చేయడం సాధారణంగా జరిగేదే! కానీ, ఇప్పుడు నవ్యాంధ్రలో జరుగుతున్న రాజకీయం వేరు.
జగన్‌కు బీజేపీ, టీఆర్ఎస్ కొమ్ము కాస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా డీజీపీని మార్చేయాలని జగన్ కోరడం... ‘షెడ్యూలు రాగానే మార్చడం ఖాయమని’ కేసీఆర్ పత్రికలో రావడాన్ని టీడీపీ వర్గాలు ప్రత్యేకంగా చూస్తున్నాయి. అదే సమయంలో... డీజీపీని మార్చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈసీపై ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందనే అనుమానం వ్యక్తమవుతోంది. కోడ్‌కు ముందే కొరడా...: నిజానికి ఎన్నికల కమిషన్ ఈసారి నవ్యాంధ్రపై ‘ప్రత్యేక’ దృష్టి సారించింది. రాష్ట్ర సీఈవోగా ఉన్న సిసోడియా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారంటూ ఆయనను మార్చాలని సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించి... సీఈవోగా ద్వివేదీని నియమించింది. ఇక... ఎన్నికల సన్నద్ధతపై నిర్వహించిన సమావేశంలో ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయారంటూ శ్రీకాకుళం కలెక్టర్‌ను మార్పించింది. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మూడు రోజులే అయ్యిందని చెప్పినా పట్టించుకోలేదు. పట్టుపట్టి మరీ తాను అనుకున్నది సాధించింది. ఈసీ వైఖరిపై ‘కోడ్‌కు ముందే కొరడా’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు... షెడ్యూలు ప్రకటించి, ఎన్నికల కోడ్ రాగానే డీజీపీ ఠాకూర్‌ను కూడా మార్చాలని ఈసీ ఆదేశించడం ఖాయమని తెలుస్తోంది.