అధికార తెలుగుదేశం పార్టీలో ఎన్నికల కసరత్తు గతానికంటే భిన్నంగా, జోరుగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూలుకంటే మెజారిటీ అభ్యర్థులపై స్పష్టత వస్తోంది. అంతేకాదు... ఈ మొత్తం కసరత్తును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిచేత్తో లాగిస్తున్నారు. టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రతిసారీ చివరి నిమిషం దాకా సస్పెన్స్ కొనసాగేది. నామినేషన్ల ప్రక్రియ ఆఖరు దశకు చేరుకున్నాక కూడా కొన్ని స్థానాలపై స్పష్టత వచ్చేది కాదు. ఇప్పుడు ఈ దృశ్యం మారింది. చంద్రబాబు ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా దాదాపు సగం స్థానాలపై స్పష్టత ఇచ్చేశారు. అంతా బాగుందనుకున్న చోట సిట్టింగ్లు, ఇన్చార్జులను పనిచేసుకోవాలని చెప్పేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ... వర్గ తగాదాలు, సిట్టింగ్లపై తీవ్ర అసంతృప్తి ఉన్న స్థానాల్లో ఎంపికను వాయిదా వేయడంపైనే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి స్థానాలపై చంద్రబాబు పార్టీ సీనియర్లతో కమిటీ వేసి... విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేవారు. చివరగా తానే నిర్ణయం తీసుకున్నవారు. ఈసారి మాత్రం ‘అన్నీ తానై’ అన్నట్లుగా మొత్తం వ్యవహారాలను చంద్రబాబే పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాల్లో పర్యటనలు, ప్రభుత్వ కార్యకలాపాలకు తోడు... అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. ఒక పక్క కుట్రలను ఎదుర్కుంటూనే, గత కొన్నిరోజులుగా రాత్రి 1.30 గంటల వరకు సమీక్షల్లో మునిగి తేలుతున్నారు. ఎన్నికల వ్యూహాలు, మ్యానిఫెస్టోలో పెట్టే అంశాలు, ప్రత్యర్థుల దాడిని తట్టుకునే మార్గాలు, ప్రభుత్వ పాలన అన్నీ ఆయన చూసుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూపులు ఉన్న నియోజకవర్గాల వ్యవహారం కూడా స్వయంగా ఆయనే చూడడం కష్టంగా మారింది. అసంతృప్తులను నేరుగా ఆయన ముందుకు తీసుకొచ్చినా అప్పటికప్పుడు రాజీ కుదర్చడానికి గంటల కొద్దీ సమయం వెచ్చించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు అది కుదరని పని. ఈ నేపథ్యంలో ఇలాంటి నియోజకవర్గాల వివాదాలను సర్దుబాటు చేసేందుకు కొందరు సీనియర్ నేతలను ఎంపికచేసి... ఆ బాధ్యతలు వారికి అప్పగిస్తే బాగుంటుందన్నది పార్టీ వర్గాల మాట! కొన్నిచోట్ల టికెట్ రేసులో ఇద్దరు, ముగ్గురు నేతలుండగా... సిట్టింగ్లు ఉన్న చోట అసమ్మతి ఉంది. రేసులో ఉన్న వారికి సర్దిచెప్పడం సులువుగా ఉన్నప్పటికీ.. సిట్టింగ్లపై అసమ్మతి జ్వాలలు ఉన్న స్థానాల్లో మాత్రం పరిస్థితి క్లిష్టంగానే ఉంది. రెండు వర్గాలను సముదాయించి ముందుకెళ్తేనే పార్టీ విజయానికి భరోసా ఉంటుంది. దీనికోసం సీనియర్లతో కూడిన కమిటీని నియమించి... నియోజకవర్గాల వారీ బాధ్యతలను వారికి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల సందర్భంగా కూడా ఇలా సీనియర్ నేతలను జిల్లాలకు పంపడం, లేదా ఒక కమిటీని ఏర్పాటుచేసి పరిష్కారం కనుగొనడం... చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవడమనే పద్ధతినే అనుసరించారు.
పింఛన్లు రెట్టింపు చేయడం, పసుపు-కుంకుమ కింద రెండోసారి డ్వాక్రా మహిళలకు రూ.10వేల చొప్పున ఇవ్వడం, అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు సహాయం... వంటి చర్యలతో క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ‘‘ప్రభుత్వం ఏ వర్గాన్నీ వదలకుండా లబ్ధి చేకూర్చింది. ఇక అడగడానికి ఏమున్నాయి అనే స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అయితే ఆ పథకాలు, చంద్రబాబు కారణంగా వచ్చిన సంతృప్తిని కిందిస్థాయిలో నేతలు కొనసాగిస్తే సరిపోతుంది. కానీ, చాలామంది ఆ పనికూడా చేయడం లేదు. నియోజకవర్గాల్లో ఇగోలకు వెళ్లడం, కష్టించి పనిచేసే వారిని పక్కన పెట్టడం, గ్రూపులు కట్టడంతో కార్యకర్తల్లో స్తబ్ధత ఏర్పడింది. రాబోయే రోజులు కార్యకర్తలవే అన్న భరోసా వీరిలో కల్పించాలి. కిందిస్థాయిలో నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలే ఈ పని చేయాలి. అందరినీ కలుపుకొని, కార్యకర్తల్ని చైతన్యపరిచి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిపైనే ఉంటుంది’’ అని ఒక సీనియర్ నేత పేర్కొన్నారు. ఇలాంటి సమస్య కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఉందని, అది కూడా త్వరలోనే పరిష్కారమవుతుందని తెలిపారు.