తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ ఈసారి ఎన్నికల్లో పోటీచేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన కోడలు రూప కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు ఆయన అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. ఇక నుంచి తాను ఏర్పాటుచేసిన ట్రస్టు కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. అమరావతిలో శుక్రవారం రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. మురళీమోహన్ కూడా హాజరు కానున్నారు. ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని సీఎంకు స్వయంగా తెలియజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరో పక్క, నెల్లూరు జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులపై స్పష్టత వచ్చింది. గురువారం జరిగిన నెల్లూరు, తిరుపతి లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లపై జరిగిన సమీక్షలో ఈ దిశగా సంకేతాలు వెలువడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమీక్షలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఆరు అసెంబ్లీ స్థానాలు నెల్లూరు లోక్‌సభ స్థానంలో.. మిగతా నాలుగు తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ స్థానం కూడా నెల్లూరు లోక్‌సభ పరిధిలో ఉంది. నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఏడెనిమిది చోట్ల టీడీపీ అభ్యర్థులెవరో ఇప్పటికే స్పష్టత వచ్చింది.
నెల్లూరు అర్బన్‌లో పురపాలక మంత్రి పి.నారాయణ, నెల్లూరు రూరల్‌లో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లిలో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, వెంకటగిరిలో ఎమ్మెల్యే కె.రామకృష్ణ, కావలిలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, కోవూరులో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. గూడూరులోనూ పోటీ ఉన్నా ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఉదయగిరి, సూళ్లూరుపేట స్థానాలపె అస్పష్టత కొనసాగుతోంది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావును కొందరు నియోజకవర్గ నేతలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలోకి వచ్చే కందుకూరు సీటు ఎమ్మెల్యే పోతుల రామారావుకు ఇవ్వడం ఖాయమేనంటున్నారు.