జగన్ లండన్ వెళ్తూ వైకాపా ఇన్‌ఛార్జి పదవిని కేటీఆర్‌కు అప్పగించారా? అని మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. కేసీఆర్ చక్రవర్తి ఆయన యువరాజు కేటీఆర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సామంత రాజుగా జగన్‌ను ప్రకటించారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణాలో ఆయన రాజుగా ఉంటూ, ఏపిని కూడా కైవసం చేసుకొని, ఇక్కడ జగన్ ను సామంత రాజుగా పెట్టి, ఏపిని హైదరాబద్ నుంచి పాలించే కుట్ర చేస్తున్నారని అన్నారు. వైకాపా, తెరాస జోడీకి సంయుక్తంగా ప్రజలు గిఫ్ట్ ఇవ్వబోతున్నారని అన్నారు. ‘‘మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మీ పెత్తనాలు, కుటుంబ పాలన కోసం రాష్ట్రాన్ని విడదీశారు. ఇప్పుడు మా రాష్ట్రంపై పెత్తనం చేయాలని బయల్దేరితే సహించేది లేదు’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన దేవినేని.. మోదీ, కేసీఆర్, జగన్‌పై విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసే వారిపై దాడులు చేస్తున్నారని, నోటీసులు ఇచ్చి ఆస్తులు ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారని దేవినేని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో కేసీఆర్ దుర్మార్గాలు, కుట్రలు చేస్తున్నారని.. మోదీ, జగన్, కేసీఆర్ కలిసి చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు 26 పార్టీలను ఏకతాటిపైకి తెస్తే మా దేశభక్తిని శంకిస్తారా? అని ప్రశ్నించారు. అధికారం ఉందనే మిడిసిపాటు తగదని ఎద్దేవాచేశారు. ‘‘మీరు మాట్లాడే ప్రతి మాటా మా ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉంది. ఐదు కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని దేవినేని అన్నారు. జూన్‌లో చంద్రబాబు చెప్పే ప్రధానే దిల్లీలో వస్తున్నారని, చరిత్ర పునరావృతమవుతుందని పేర్కొన్నారు. పోలవరంపై కవిత కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.
అందుకే జగన్ పోలవరం వెళ్లట్లేదు... జగన్ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించలేదని మంత్రి దేవినేని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పునాదులు కూడా లేవలేదని జగన్ చెబుతున్నారని, కానీ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తే ఎక్కడ వాస్తవాలు చెప్పాల్సి వస్తుందోనని వెళ్లట్లేదని విమర్శించారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టు కూడా ఇంత వేగంగా జరగట్లేదని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.4,121 కోట్లు ఖర్చు పెట్టి పనులను పరుగెత్తిస్తున్నారు అని చెప్పారు. రూ.1500 కోట్లు ఇచ్చి దిల్లీని తలదన్నే రీతిలో రాజధాని నిర్మించాలని మోదీ ఎగతాళి చేశారని విమర్శించారు. మోదీ తెలుగు జాతిపై ఎందుకు కక్ష గట్టారు? అని ప్రశ్నించారు.