కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేపట్టిన ‘సత్యాగ్రహ’ ధర్నా కొనసాగుతోంది. శారదా కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించే నిమిత్తం సీబీఐ అధికారులు అనూహ్యంగా నిన్న సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ రాత్రికి రాత్రే దీక్షకు దిగారు. ఆదివారం రాత్రి భోజనం నిరాకరించిన దీదీ రాత్రంతా మేల్కొనే ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేంతవరకు నేను ఈ సత్యాగ్రహాన్ని కొనసాగిస్తాను’ అని అన్నారు. ఈ ఉదయం భారీ సంఖ్యలో తృణమూల్ నేతలు, కార్యకర్తలు దీక్షా వేదిక వద్దకు చేరుకుని మమతాబెనర్జీకి మద్దతు పలికారు.
మరోవైపు తాజా పరిణామాలని గమనిస్తున్న చంద్రబాబు, దీదీకి మద్దతుగా నిలిచారు. కేంద్రానికి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య పోరు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోల్‌కతా వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మమతకు మద్దతు తెలపనున్నారు. ఈ మేరకు చంద్రబాబు రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. దిల్లీ వెళ్లాక అక్కడే భాజపాయేతర పక్షాలతో కలిసి సంఘీభావం తెలిపే యోచన ఒకటైతే.. దిల్లీ పర్యటన ముగియగానే అటు నుంచి కోల్‌కతా వెళ్లి మమతను కలిసి మద్దతు తెలిపే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. సిఎంఓ అధికారులు, దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో కేంద్రం చర్య దుర్మార్గమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాల్ని తమ నియంత్రణలో ఉంచుకోవాలనే కేంద్రం తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధమని, దీని పై అంతా ఐక్యంగా పోరాడుతామని స్పష్టం చేశారు. సహకార సమాఖ్య వ్యవస్థ అన్న మోదీ ఇప్పుడు రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహాం వ్యక్తం చేశారు. భాజపాకి లొంగిపోయిన వారి పై కేసులు ఎత్తివేస్తున్నారు.. భాజపాని ఎదిరిస్తే పాతకేసులు బయటకు తీస్తున్నారన్నారు. మొన్న అఖిలేశ్, మాయావతిని లక్ష్యంగా చేసుకున్నారని.. ఇప్పుడు మమతా బెనర్జీపై కక్ష సాధింపునకు దిగారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలందరిపై కేసులు పెట్టి భాజపా ఆనందపడుతోందని విమర్శించారు. దేశస్థాయిలో ఉద్యమానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నమని.. అన్నిపార్టీలను సమన్వయం చేస్తూ జాతీయపార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ రోజు దిల్లీ పర్యటనలో కూడా దీనిపైనే చర్చిస్తామని ముఖ్యమంత్రి నేతలకు వివరించారు.