దేశంలోనే ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని సంఘటన. ఇప్పటి వరకూ ఎక్కడా జరగని యుద్ధం! బెంగాల్ నడి వీధుల్లో కోల్కతా సిటీ పోలీసులు, సీబీఐ అధికారులు ఘర్షణ పడ్డారు. బాహాబాహీ తలపడ్డారు. సీబీఐ అధికారులను కోల్కతా సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు జీపుల్లో ఎత్తి పడేశారు. జీపులు ఎక్కడానికి నిరాకరిస్తే లోపలికి తోసేశారు. పోలీసు స్టేషన్లకు తరలించారు. కోల్కతాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న హైటెన్షన్ హైడ్రామా ఇది. దీని పై చంద్రబాబు స్పందించారు. రాష్ట్రాల్లోని రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాల ద్వయం రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కోల్కతా ఘటనే దీనికి తాజా నిదర్శనమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇలా చేస్తుండటం దేశంలో విపరిణామాలకు దారితీస్తుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విటర్లో స్పందించారు.
‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడుతున్న సందర్భంలో మోదీ నేతృత్వంలోని భాజపా గెలుపుపై అన్ని ఆశలను కోల్పోయింది. అందుకే రాజ్యాంగ బద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులను తారస్థాయికి చేర్చింది. రాజ్యాంగాన్ని, దాని స్ఫూర్తిని, దేశంలో సమాఖ్య వ్యవస్థను కాపాడేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి వెన్నంటే మేముంటాం’’ అని ట్విటర్లో వ్యాఖ్యానించారు. అంతకు ముందు కోల్కతాలో సీబీఐ అధికారులు అక్కడి పోలీసులకు మధ్య నెలకొన్న వివాద ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ఆమెకు సంఘీభావం ప్రకటించారు.
దేశంలో బీజేపీ ఆశలు సన్నగిల్లటం ప్రారంభమయ్యాయని చెప్పారు. కేంద్ర సంస్థలతో రాష్ట్రాలను భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం చర్యలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రాజకీయ ప్రత్యర్థులను వేధించడం సరికాదని సూచించారు. లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశంలో ఇలాంటి పరిస్థితులు అశాంతి సృష్టిస్తాయని వెల్లడించారు. మమతా బెనర్జీకి అండగా ఉంటామని, సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగాన్ని రక్షించేందుకు మద్దతు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ, షా ద్వయం వ్యవస్థలను ధ్వంసం చేస్తుందనేందుకు కోల్కతా పరిణామాలే నిదర్శనమని ఆయన మండిపడ్డారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకమవుతున్నాయని చంద్రబాబు అన్నారు.