రాష్ట్రంలో ఫిబ్రవరి 9న మూడు లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించన్నుట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. గతంలో కంటే మిన్నగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో 13 జిల్లాల ప్రాజెక్టు డైరక్టర్లతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు విడుతల గృహ ప్రవేశాలను చాలా బాగా నిర్వహించారన్నారు. ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రికి ఎక్కువ సంతృప్తి ఇచ్చే పథకం పేదలకు సొంత ఇంటి కల అని చాలా సందర్భాల్లో చెప్పడాన్ని గుర్తు చేశారు. ఈ సారి వేడుకలను అంకితం పేరుతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి కారణంగా గతంలో స్కోచ్ అవార్డులను పొందిందని, ఈ సారి కూడా ప్రతిపాదనలను పంపాలన్నారు.
గురువారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 33 మంది ఖైదీలకు విముక్తి కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇప్పటికే 5 నుంచి 7 సంవత్సరాల జైలుశిక్ష అనుభవించిన వారు 65 ఏళ్ల పైబడి వ్యాధులతో బాధపడే వారిని ప్రత్యేక పరిస్థితుల్లో విడుదల చేయాలని నిశ్చయించింది. ఈ నెల 9న నెల్లూరులో పెద్దఎత్తున సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించింది.
అర్బన్‌లో లక్ష, రూరల్ పరిధిలో 3లక్షల ఇళ్లకు ఒకే రోజు సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తారు. తరువాత ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులు హాజరవుతారు. గత నెలలో జరిగిన జయహో బీసీ కార్యక్రమం సందర్భంగా బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు జీవోలు జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిబంధనలు రూపొందించాలన్నారు. బీసీలలో పేదరిక నిర్మూలన లక్ష్యంతో పనిచేయాలన్నారు. వివిధ బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చే అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వివిధరకాల పింఛన్లను పెంచుతూ గత నెల 25 వ తేదీన విడుదల చేసిన జీవోలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. రాష్టవ్య్రాప్తంగా కొత్తగా 3.55 లక్షల మందికి పింఛన్లను పెంచుతూ గత నెల 28వ తేదీన విడుదలైన జీవోను సమావేశంలో ఆమోదించారు. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో పింఛన్లను పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీలైతే ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్ అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.