వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా .. ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. విజయవాడ నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధానంగా రాజీనామా అంశంపైనే మాట్లాడారు. టీడీపీలో చేరుతున్నారనే ప్రచారంపై మీడియా ప్రశ్నించగా.. ఆయన ఆవేశంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే.. దాడులు, ప్రతిదాడులు చేస్తూ.. నానా రకాలుగా మాట్లాడుతున్నారు. రంగాను అభిమానించే వాళ్లు ప్రతిపార్టీలో ఉన్నారు. నా వాళ్లను కాపాడుకోవలసిన బాధ్యత నాపై ఉంది. రాధా అనే వ్యక్తికి పదవి మాత్రమే ముఖ్యం కాదు. మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. నా తండ్రి వంగవీటి రంగా ఆశయ సాధన కోసమే వచ్చాను."
"అన్యదా భావించవద్దని వారికి చెబుతున్నాను. ప్రజా జీవితం కొనసాగిస్తాను. నేను ముఖ్యమంత్రి గారిని ఒకే ఒక కోరిక కోరుతున్నాను. విజయవాడ నగరంలో కొన్ని వేల పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాను. పెద్దమనిషిగా ఆలోచిస్తారని భావిస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కొన్ని లోపాలున్నాయి. వాటిని సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భావావేశాలతో ముడిపడి ఉంది. రంగా ఆశయాన్ని ఎవరు నెరవేరిస్తే వాళ్లను నెత్తిని పెట్టుకుని చూస్తాము. పెద్దకొడుకు అనుకోండి, చిన్న కొడుకు అనుకోండి, ప్రజలకు మేలు చేసే ఈ పని చేసి పెట్టండి అని’’ అన్నారు. టీడీపీలో చేరిక పై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే మీడియా సమావేశాన్ని ముగించారు.
అన్ని కులాలు, మతాలు, పార్టీల్లో రంగా అభిమానులున్నారని రాధా చెప్పారు. తనను చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపులు కూడా వచ్చాయని.. ఎవరి దాడులకు భయపడేవాడిని కాదన్నారు. తనకు ప్రాణం కంటే తన తండ్రి ఆశయం ముఖ్యమని.. రంగా అనే వ్యవస్థను బతికించాలన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజాజీవితంలో కొనసాగాలనుకుంటున్నానని.. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేని పార్టీలో ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. అందుకే వైకాపాలో కొనసాగి ఏమీ చేయలేననే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తాను చెప్పే ప్రతి మాట వాస్తవమని, ఈ విషయంలో వైకాపాలో చాలా మందికి తెలుసన్నారు. కానీ వాళ్లు బయటకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదని చెప్పారు. ఆత్మాభిమానం చంపుకొని, అవమానాలు భరిస్తూ ఇన్నాళ్లూ వైకాపాలో కొనసాగామన్నారు.