గత కొన్ని రోజులుగా తన పై వస్తున్న పుకార్లకు, అఖిల ప్రియ ఫుల్ స్టాప్ పెట్టారు. తెలుగుదేశం పార్టీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీని వీడే ప్రసక్తే లేదని మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ జనసేనలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. అసలు జనసేనలోకి ఎలా వెళ్తాను అంటూ ఒక్క దెబ్బతో ఆ పార్టీని తీసి పడేసారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబుకు ఎందుకు దూరం అవుతానని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, విజయాన్ని చంద్రబాబుకు కానుగా ఇస్తానని మంత్రి తెలిపారు. పోలీసులు నతన అనుచరులను వేధిస్తున్నారనే గన్మెన్లను దూరంగా పెట్టానని వివరణ ఇచ్చారు. గన్మెన్ల వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని మంత్రి అఖిలప్రియ తెలిపారు.
ఇదిలా ఉంటే, తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఏకగ్రీవం అయ్యారు. ఆ తర్వాత తండ్రి భూమా నాగిరెడ్డితో కలసి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ క్రమంలోనే అఖిలప్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. పిన్న వయసులోనే అనూహ్య పరిణామాల మధ్య అఖిలప్రియని మంత్రి పదవి వరించడం విశేషం. అఖిలప్రియ రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకూ ప్రతి అంశం కలిసొచ్చింది. అయితే వచ్చే ఎన్నికలు మాత్రం ఆమెకు పెద్ద సవాలుగా మారనున్నాయి. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఇరిగెల రాంపుల్లారెడ్డి జతకడితే.. 2019 ఎన్నికల్లో అఖిలప్రియ ప్రత్యర్ధులతో గట్టిగానే పోరాడాల్సి ఉంటుంది.
ప్రత్యర్ధులందరూ ఏకమైనా గెలుపు తమదే అనే ధీమాలో ప్రస్తుతం అఖిలప్రియ ఉన్నారు. మెజారిటీపైనే ఫోకస్ పెట్టానని చెబుతున్నారు. ఇప్పటినుంచే సరికొత్త వ్యూహాలతో ఆమె తీవ్ర కసరత్తు మొదలుపెట్టారు. అయినప్పటికీ బలమైన క్యాడర్ కలిగిన ప్రత్యర్ధులను అఖిలప్రియ వ్యూహాలు ఏమేరకు బలహీనపరుస్తాయనేది ఆసక్తికర అంశంగా మారింది. మరోవైపు పోలీసులతో నెలకొన్న వివాదంపై ఆమె ఎలా వ్యవహరిస్తారన్న అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల ముందు అకస్మాత్తుగా తెరపైకి వస్తున్న ఇలాంటి పరిస్థితులను మంత్రి అఖిలప్రియ ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి!