గుంటూరు జిల్లా పుష్పగిరి పీఠం భూముల వివాదానికి సానుకూల పరిష్కారం లభించింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పీఠం పెద్దలు, రైతులు, అధికారులు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశారు. పీఠానికి, రైతులకు నడుమ పెద్దలుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి డిజిపి అరవింద్‌రావు, సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏ రైతుకు భూ వేధింపులు అనేవి ఉండకూడదన్నారు. అన్నిరకాల భూ వివాదాలను పరిష్కరిస్తున్నాం. ఆధార్ తరహాలో భూధార్ తెచ్చాం. స్వాతంత్ర్యం ముందు నుంచీ సతమతం చేస్తున్న భూ వివాదాలను కూడా పరిష్కరిస్తున్నాం. చుక్కల భూముల సమస్యను పరిష్కరించాం. భూ రికార్డులను టాంపర్ చేసే పరిస్థితే లేకుండా చేశాం. మఠం రుణం రైతులు తీర్చుకోవాలి.
రైతుల ఆశలను మఠం నెరవేర్చాలి. రైతుకు చేసే మేలుకన్నా గొప్ప ఆధ్యాత్మిక, థార్మిక కార్యక్రమం మరొకటిలేదు. ఇది 3వేల రైతు కుటుంబాల సమస్య. ఆరేడు దశాబ్దాలుగా రగులుతున్న సమస్య. వివాదం వల్ల రుణాలు పొందేవీలు లేక రైతుల ఇక్కట్లు. ఈ భూమిపై ఆదాయం రాక పీఠం ఆవేదన. స్పీకర్ చొరవతో, పెద్దలు పొత్తూరి, అరవింద్‌రావు సలహాలతో సమస్య పరిష్కారం. పుష్పగిరి పీఠం, రాష్ట్ర ప్రభుత్వం, రైతులు ఉమ్మడిగా అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేద్దాం. స్థానిక ధర ప్రకారం 13శాతం చెల్లించేందుకు రైతులు ముందుకు వచ్చారు. అందుకు పుష్పగిరి పీఠం కూడా అంగీకరించింది. ఉభయ కుశలోపరిగా ఇరువర్గాలు సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవడం మంచిపని. రాష్ట్రప్రభుత్వ తరఫున పూర్తి సహకారం ఇస్తాం. రైతులకు,పీఠానికి అనుకూల నిర్ణయం తీసుకుంటున్నాం. రేపు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో దీనిపై కూడా చర్చిస్తాం. రాష్ట్రంలో ఏ రైతుకు భూ వివాదం అనేది ఉండరాదు.
అందుకే రెవిన్యూ శాఖలో వినూత్న సంస్కరణలు. తన భూమికి ఏమి అవుతుందనే చింత ఏ రైతు పడరాదు. మనకు ఇన్ని ఇచ్చిన రైతుకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే రూ.16 వేల ఆర్ధిక లోటులో కూడా రైతులకు రూ.24వేల కోట్ల రుణ ఉపశమనం కల్పించాం. దేశం మొత్తం రైతాంగం అశాంతితో రగిలిపోతుంటే మన రైతులు మాత్రం గుండెల్లో పూర్తి భరోసాతో సేద్య పనుల్లో నిమగ్నం అయ్యారు. కేంద్రంలో బిజెపి నేతల రైతాంగ వ్యతిరేక విధానాలు బాధాకరం. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలన్నింటిలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడం కేంద్ర ప్రభుత్వ ఘోరవైఫల్యం. ఎక్కడ రైతు సంతోషంగా ఉంటాడో అక్కడే సిరి, సంపద ఉంటాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పీఠం పెద్దలు, రైతులు సీఎం చంద్రబాబును సత్కరించారు.