రాష్ట్రంలో బీజేపీ నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు బహిరంగ సభల్లో తొలి సభకు వేదికను ఖరారు చేసినట్లు సమాచారం. నాగార్జున యూవర్సిటీ ఎదుట బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 6న మొదటి సభ నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. జాతీయ రహదారికి సమీపంలో ఉండడం, జన సమీకరణకు రాష్ట్రం మధ్యలో ఉండడం, అటు రాయలసీమ, ఇటు ఉత్తర కోస్తా నుంచి జన సమీకరణకు అవకాశం ఉండడంతో ఈ ప్రదేశాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. 5 లక్షల మందికి పైగా జన సమీకరణ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమైన రాష్ట్ర అగ్రనేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మొదట గుంటూరులో మీటింగ్ పెడితే, అమరావతి పై మోడీ చెప్పిన విషయాల పై ప్రజలు నిలదీస్తారని, అందుకే గోదావరి జిల్లాలో ఈ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాని, గుంటూరు, కన్నా లక్ష్మీనారాయణ సొంత జిల్లా కావడంతో ఆయన సత్తా చాటుకోవడానికి, అధిష్టానాన్ని ఒప్పించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనికి తోడూ, ఏపిలో, ప్రధాని మోదీ రెండు సభలకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఈ సమాచారాన్ని ఆదివారం సాయంత్రం రాష్ట్ర నేతలకు చేరవేశారు. ఈ సభ ద్వారా బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న సహాయ సహకారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే వేల కోట్లు ఇచ్చామని బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇక మోడీ గారు వచ్చి, లక్షల లక్షల కోట్లు ఇచ్చామని ప్రచారం చేస్తారేమో చూడాలి.
ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. దాని బదులు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఊసే ఎత్తకపోవడం.. రాజధాని, పోలవరం నిర్మాణాలకు అడ్డంకులు.. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోవడం, రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారంపై దాటవేతలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడచిన నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమిచ్చిందో ప్రధాని సదరు సభలో వివరిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీని కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ వచ్చేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో ఏపి బీజేపీ ఈ మీటింగ్లు ప్లాన్ చేసింది.