తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం డిసెంబర్ 15 నాటికి పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు కోర్టు తెలిపింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు న్యాయమూర్తులు కూడా సంతృప్తి చెందారని, జనవరి 1న కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అతిత్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైకోర్టు కార్యకలాపాలు కొనసాగిస్తాయని అత్యున్నత న్యాయస్థానం ఆశాభావం వ్యక్తం చేసింది.
అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణం కొనసాగుతున్నందున జడ్జిల నివాసం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించింది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తిస్థాయిలో జరుగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో పక్క పోయిన వారం, అమరావతిలో నిర్మిస్తున్న, జస్టిస్ సిటీ విశేషాలను చాటిచెప్పడానికి సీఆర్డీఏ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఢిల్లీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాయి. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ శాంతాన గౌడార్, జస్టిస్ వినీత్ సరన్, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ ప్రతిభా, జస్టిస్ సురేష్ ఖైత్, ఇతర న్యాయకోవిదులు పాల్గొన్నారు. జస్టిస్ సిటీ అద్భుతమని, ఇలాంటి నగరం దేశంలోనే ఉండదని పలువురు న్యాయమూర్తులు కొనియాడారు. జస్టిస్ సిటీ కలకాలం వర్ధిల్లాలని పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఆకాంక్షించారు.
జస్టిస్ సిటీ 3డీ డిజైన్ల ద్వారా న్యాయమూర్తులకు సిటీ వివరాలను, ప్రాముఖ్యతను, నిర్మాణ శైలిని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ రవీంద్ర భట్ మాట్లాడుతూ.. జస్టిస్ సిటీ తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. జస్టిస్ సురేష్ ఖైత్ మాట్లాడుతూ.. తాను ఈ ఏడాది ఆగస్టు 18న జస్టిస్ సిటీ ప్రాంతాన్ని సందర్శించానని వివరించారు. కోర్టు హాళ్లు, ఇతర గదులను విశాలంగా నిర్మిస్తున్నారని చెప్పారు. జస్టిస్ ప్రతిభా మాట్లాడుతూ.. ఈ సిటీ కలకాలం నిలవాలని ఆకాంక్షించారు. అమరావతి ఎప్పుడూ అమరంగా ఉంటుందని స్పష్టం చేశారు. జస్టిస్ సిటీ పరిశీలనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని న్యాయమూర్తుల కమిటీ తరలి వస్తోంది.