తిత్లీ తుపానుతో అతలాకుతలమయిన శ్రీకాకుళం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల ఐకాస రూ.31 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అక్టోబర్ నెల వేతనం నుంచి ఈ సాయం అందజేస్తున్నట్లు ఐకాస ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదిక ఐకాస ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ముందుకురావడం ఎంతో స్ఫూర్తి దాయకమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆల్ఫ్రెడ్ ఉన్నారు.
తిత్లీ తుపానుతో అతలాకుతలమయిన ఉద్ధానం ప్రాంతంలోని బాధితుల సహాయార్థం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి శ్రీ విజయా ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ విద్యార్థులు రూ. 3,31,116 సేకరించారు. విరాళానికి సంబంధించిన మొత్తాన్ని విద్యార్థులు మేఘన, ఉమ, మీనాక్షి, హేమంత్ శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. దాదాపు 2 వేల మంది కలిసి ఈ విరాళాలను సేకరించినట్లు విద్యార్థులు వివరించారు. తిత్లీ బాధితులను ఆదుకునేందుకు అమెరికాలోని ప్రవాసాంధ్రులు స్పందించి వారిని ఆదుకునేందుకు విరాళాలు సేకరించారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలు, వస్తువుల్ని పంపిణీ చేశారు.
ఎన్ఆర్ఐ తెదేపా అమెరికా విభాగం ఆధ్వర్యంలో సుమారు రూ.50 లక్షల విరాళాలు సేకరించారు. దానిలో రూ.30 లక్షలతో రొట్టెలు, వాటర్ క్యాన్లు, దోమ తెరలు, బట్టలు, దుప్పట్లు, ఎల్ఈడీ ల్యాంప్‌లు వంటివి తుపాను బాధిత ప్రాంతాలకు పంపించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఎన్ఆర్ఐ తెదేపా స్థానిక ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, రవీందర్ పంపిణీ వ్యవహారాల్ని సమన్వయం చేస్తున్నారు. రూ.20 లక్షలతో పాఠశాల భవనం నిర్మిస్తామని ఎన్ఆర్ఐ తెదేపా ప్రతినిధి రామ్ చౌదరి తెలిపారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) పలాస, సోంపేట వంటి ప్రాంతాలకు 50 మందికి పైగా వాలంటీర్లను పంపించింది.